హాంకాంగ్‌లో మాస్కుల నిషేధ చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు చేస్తోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. పెద్దసంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు నగరంలో కవాతు చేశారు.
పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సబ్వే స్టేషన్లపై విరుచుకుపడ్డారు నిరసనకారులు. దుకాణాలపై దాడులు చేశారు. రోడ్లపై విధ్వంసం సృష్టించారు. వాన్టై సిన్ ప్రాంతంలోని దుకాణాలకు నిప్పు అంటించగా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది.
ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సుమారు 2,100 మందిని అరెస్టు చేశారు. 204 మందిపై కేసు నమోదు చేశారు.
మాస్కుల నిషేధం వల్ల స్వేచ్ఛ కోసం మరింత ఎక్కువ మంది ప్రజలు బయటకు వచ్చి పోరాడతారని ఆందోళనకారుల ప్రతినిధి విలియం మోక్ చెప్పారు. లక్షల మందిని అరెస్టు చేసినా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఆర్డినెన్సు జారీ
చైనా వ్యతిరేక ప్రదర్శనలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా మాస్కులను ధరించకుండా హాంకాంగ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు హాంకాంగ్ సీఈఓ కారీ లామ్ ప్రకటన చేశారు. తీవ్రవాద చర్యలను అదుపు చేసేందుకు.. నిరసనలు, బహిరంగ సభల్లో ముసుగులపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు. శనివారం నుంచి ఈ చట్టం అమలవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వేలాది 'నకిలీ వార్తల' ఖాతాలపై ట్విట్టర్ వేటు