బాలాకోట్‌ను సందర్శించేందుకు విదేశీ ప్రతినిధులను, అంతర్జాతీయ మీడియా సంస్థలను ఆహ్వానించింది పాకిస్థాన్ సైన్యం. అక్కడి ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించిన 43రోజలు తర్వాత మొదటిసారి ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు విదేశీ ప్రతినిధులను అనుమతించింది పాక్. ఇస్లామాబాద్ నుంచి బాలాకోట్‌లోని జబ్బా వరకు హెలికాప్టర్లో వీరంతా వెళ్లినట్లు సమాచారం.
బాలాకోట్‌లో భారత వాయుసేన దాడులు చేయలేదని చెప్పేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. దాడులు జరిగిన 43 రోజుల తర్వాత ఘటనా స్థలంలోకి అనుమతిచ్చి మరోసారి కపటత్వాన్ని చాటిచెప్పుకుంది.
మీడియా ప్రతినిధుల సందర్శన సమయంలో బాలాకోట్‌లోని మదర్సాలో దాదాపు 150 మంది విద్యార్థులకు ఖురాన్‌ను బోధిస్తున్నారు.
"అక్కడ మదర్సా చాలా ఏళ్లుగా అలానే ఉంది. భారత వాయుసేన దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదు."
-ప్రతినిధులతో పాక్ సైనికాధికారి అసిఫ్ గఫూర్
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్ బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.
ఘటనలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ పేర్కొంది.
భారత్ వాదనను పాక్ అంగీకరించలేదు. తమకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చూడండి:వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు