మూడో దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు నేపాల్ మీదగా ప్రయాణించడం మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ సూచించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విదేశీయులు తమ దేశాన్ని రవాణా పాయింట్‌గా వినియోగించుకోవడంపై నేపాల్ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం తాజా ప్రకటన చేసింది.
ప్రత్యేకంగా నేపాల్‌కు వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నేపాల్‌లోని భారతీయ ఎంబసీ తెలిపింది. ఇప్పటికే నేపాల్ చేరుకున్న భారతీయుల ప్రయాణాల కోసం నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
కరోనా నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది నేపాల్. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడో దేశానికి వెళ్లేందుకు రవాణా పాయింట్‌గా వినియోగించకుండా ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 28 అర్ధరాత్రి నుంచి తదుపరి ప్రకటన చేసే వరకు ఇవి అమల్లో ఉంటాయని నేపాల్ హోంశాఖలోని ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. నేపాల్‌లో ఇప్పటివరకు మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 3,176 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి- అమెరికా జనాభా 33.1 కోట్లు- నెమ్మదించిన వృద్ధి!