ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతిపై చైనా ప్రభుత్వం నిషేధం విధించిందని వస్తున్న వార్తలపై ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. ఒకవేళ అది నిజమైతే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నింబంధనలను చైనా ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. అంతేకాకుండా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా అతిక్రమించినట్లేనని చెప్పారు.
ఆస్ట్రేలియా మినహా ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు విద్యుత్ తయారీ కేంద్రాలకు చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ అనుమతులు ఇచ్చినట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కథనం ప్రచురించింది.
అయితే ఇది మీడియా ప్రచారంగా మాత్రమే తాము భావిస్తున్నామని, చైనా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని మారిసన్ తెలిపారు. ఒకవేళ ఇది నిజమైతే చైనాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్ చెప్పారు.
ఆస్ట్రేలియా ఇతర దేశాలకు ఎగుమతి చేసే వాటిలో బొగ్గు, ఉక్కు అత్యంత కీలకం. అయితే చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్‌పై స్వతంత్ర దర్యాప్తు జరుపుతామని ఆస్ట్రేలియా ప్రకటించిన అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి: ముగిసిన ట్రంప్ పోరు- అధ్యక్షుడిగా బైడెన్ ధ్రువీకరణ