ఆగ్నేయ ప్రాంతంలో లక్షల ఎకరాల్లో చెలరేగిన మంటల్లో చిక్కుకున్న వేలాది మందిని రక్షించడానికి ఆస్ట్రేలియా సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే దళాలను రంగంలోకి దింపింది. భారీ ఎత్తున యుద్ధ నౌకలు, సైనిక విమానాల ద్వారా రోడ్డుమార్గం మూసుకుపోయిన ప్రాంతాలకు తాగునీరు, ఆహారం, ఇంధనాన్ని తరలిస్తున్నారు.
మంటల కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. చాలామందికి కాలిన గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. రెండు పాఠశాలలు సహా అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
కొత్త సంవత్సరాదిని ఉత్సాహంగా జరుపుకునేందుకు వేలాది మంది తీర ప్రాంత పట్టణాల్లోని రిసార్టులకు రాగా వారిని దావానలం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంటల వల్ల సరఫరా లైన్లు దెబ్బతిని విద్యుత్ నిలిచిపోయింది. ఆయా పట్టణాల్లో అంతర్జాల సేవలు అందడంలేదు. మంటల వల్ల ప్రజలను రక్షించడం తమకు సవాల్‌గా మారిందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలకు రహదారి, ఆకాశ మార్గాల్లో చేరుకోవడం కష్టంగా మారినట్లు తెలిపారు.
సముద్రంలోకి వెళ్లినవారు సురక్షితం
మల్లకూట పట్టణంలో మంటలను తప్పించుకునేందుకు సముద్రంలోకి వెళ్లిపోయిన 4 వేల మంది మాత్రం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాలుల వేగం, ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గినందున మంటలను ఆర్పేందుకు కొంత వెసులుబాటు లభించినట్లు చెబుతున్నారు.
మొత్తం 200 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర పట్టణాలను కార్చిచ్చు చుట్టిముట్టింది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రం