అంతర్జాతీయ వేదికలను నిరాధారమైన, ద్వేషపూరిత ప్రచారం కోసం పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. 46వ మానవహక్కుల సమావేశంలో కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ప్రతినిధి ఆరోపించారు. ఈ మేరకు స్పందించిన భారత ప్రతినిధి సీమా పూజని ...ముందు పాకిస్థాన్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని చురకలు అంటించారు. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు.
భారత్‌లో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో సుపరిపాలన, అభివృద్ధి అందించేందుకే వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఇది భారత్ పూర్తి అంతర్గత విషయమన్న ఆమె.....ఇతరుల జోక్యం అనవసరమని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కువగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటని గుర్తు చేశారు. పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న క్రిస్టియన్లు, సిక్కులు, హిందువుల ఆలయాలు, ప్రార్థన ప్రదేశాలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆ దేశంలో మైనార్టీలకు చెందిన దాదాపు వెయ్యి మంది మహిళలకు ఏటా బలవంతపు మతమార్పిడిలు చేసి వివాహాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బలూచిస్థాన్‌లోని ప్రజలు కూడా ఇదే విధమైన అణచివేతను ఎదుర్కొంటున్నట్లు సీమా పూజని గుర్తు చేశారు. వీటన్నింటిని సరిదిద్దుకున్నాక భారత్ గురించి మాట్లాడాలని పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
ఇదీ చూడండి: 229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా