చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 36 మంది మృతి చెందగా మరో.. 36 మందికి గాయాలయ్యాయి. తూర్పు జియాంగ్సు రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కుని బలంగా ఢీ కొట్టడం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.
దుర్ఘటన సమయంలో బస్సులో 69 మంది ఉన్నారు. బస్సు ముందు టైరుకు పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు మీడియా పేర్కొంది.
చైనాలో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ముఖ్యంగా రోడ్డు నియమాలు పాటించకపోవడం.. అతివేగం ఇందుకు కారణమవుతున్నాయి.
చైనా అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2015లో కనీసం 58 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరిలో 90 శాతం మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ప్రాణాలు కోల్పోయారని అధికార యంత్రాంగం చెబుతోంది.
ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి 'సిక్ పోలీస్' మృతి