ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. వాణిజ్యంలో అగ్రరాజ్యంతో పోటీపడి దూసుకుపోతున్న తరుణంలో ఊహించని రితీలో కరోనా వైరస్ బారిన పడి కకావికలమైంది. వుహాన్‌లో పుట్టిన మహమ్మారి కారణంగా దేశమంతా స్తంభించిపోయింది. నగరాలు మూతపడ్డాయి. వేలాది మరణాలు సంభవించాయి. రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, పార్కులు, షాపింగ్ మాల్స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా రాకాసిని చైనా విజయవంతంగా ఎదుర్కొంది. కఠిన చర్యలతో మహమ్మారిని పారదోలింది. మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న వీధులు, పార్కులు ఇప్పుడు జనంతో కళకళలాడుతున్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాతరోజులు తిరిగొచ్చినందుకు ప్రజలంతా సంతోషంలో మునిగితేలుతున్నారు.
ప్రపంచ దేశాలన్నీ కరోనా కారణంగా వణికిపోతుంటే చైనా మాత్రం మళ్లీ వెలిగిపోతోంది. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, పార్కులు ఇప్పటికే తెరుచుకున్నాయి. వారాల పాటు మూతపడ్డ ప్రాంతాల్లో జనజీవనం సాధరణమైంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. దీంతో పార్కులకు వెళ్లి ఆహ్లాదంగా గడుపుతున్నారు ప్రజలు.
మూడు మీటర్ల దూరం..
కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించింది చైనా ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే జనం నడుచుకుంటున్నారు. ముసుగులు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. కరచాలనాలు చేయకుండా, దగ్గరగా ఉండకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. బీజింగ్‌లోని ఓ పబ్లిక్ పార్కులో చైనా జాతీయ నృత్యాన్ని సాధన చేస్తున్నారు కొంతమంది మహిళలు. వారిలో విశ్రాంత ఉద్యోగి కూడా ఉన్నారు. నృత్యం చేస్తున్న సమయంలో ఒకరి మధ్య మరొకరికి కనీసం మూడు మీటర్ల దూరం(10అడుగులు) ఉండేలా చూసుకున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
" కరోనా కారణంగా ప్రతి ఒక్కరు భయాందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. కనీస ప్రమాణాలు పాటించి జాగ్రత్తగా ఉంటున్నారు. అప్రమత్తతతో ఉంటూ ఒకరికొకరు దగ్గరగా లేకుండా చూసుకుంటున్నారు. పార్కులలో ఆహ్లాదంగా గడుపుతున్నారు ."
-వాంగ్, విశ్రాంత ఉద్యోగిని
ఆర్థికంగానూ
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాది. కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగులు విధులు మానేశారు. నిరుద్యోగం పెరిగింది. వీటన్నింటి నుంచి ఇప్పుడు కోలుకుంటోంది. వ్యాపార సంస్థలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తోంది చైనా. ఫలితంగా మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. వాణిజ్య రంగంలో తిరిగి తన జోరును చూపెట్టేందుకు సిద్ధమవుతోంది చైనా.
కరోనా వైరస్ ప్రభావం చైనాలో తగ్గినప్పటికీ. అగ్రరాజ్యం అమెరికా సహా, ఐరోపా, ఆసియా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు మూత పడే పరిస్థితి ఏర్పడింది.