ద్వైపాక్షిక విభేదాలు వివాదాలు కాకూడదన్నారు విదేశాంగ మంత్రి జయ్శంకర్. మూడు రోజుల ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో కలసి బీజింగ్‌లో సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతికోసం పని చేయాలని ఆకాంక్షించారు జయ్శంకర్.
"ఆస్థానాలో మన అగ్రనేతలు పేర్కొన్నట్లుగా విభేదాలను సరైన రీతిలో పరిష్కరించుకోవడం అత్యావశ్యకమైన అంశం. విభేదాలు వివాదాలుగా మారకూడదు. విభేదాల పరిష్కారం వల్ల భారత్, చైనా సంబంధాలు స్థిరంగా ఉంటాయి. ఉహాన్ సమావేశం అనంతరం ఏర్పడిన సానుకూల వాతావరణంతో చైనా, భారత్ సంబంధాలు నూతన స్థాయిలకు చేరుతాయి. ఇరుదేశాల్లోని ప్రజల సంపూర్ణ సహకారం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇందులో మీడియా పాత్ర కూడా ఉంటుంది."
-జయ్శంకర్, విదేశాంగ మంత్రి
కశ్మీర్ పరిణామాలను గమనిస్తున్నాం: వాంగ్ యీ
కశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగింపుతో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ. ప్రాంతీయ శాంతి కోసం భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు.
జయ్శంకర్ పర్యటనలో భారత్, చైనా మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమౌతారని వార్తలు వచ్చినప్పటికీ... విదేశాంగ మంత్రితో మాత్రమే సమావేశమయ్యారు జయ్శంకర్. మోదీ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైనాలో భారత విదేశాంగ మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: భుజాలపై 2 కి.మీ ప్రయాణం.. అంబులెన్స్‌లో ప్రసవం!