ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న యాంటీ పారాసైట్ డ్రగ్ 'ఐవర్ మెక్టిన్'తో కరోనా వైరస్ ను నిరోధించవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన కణాల్లోని వైరస్ ను ఐవర్ మెక్టిన్ 48 గంటల్లో పూర్తిగా నాశనం చేసినట్లు స్పష్టమైంది. ఫలితంగా కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కొత్త క్లినికల్ థెరపీని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలకు ఆస్కారం లభించింది.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు 'యాంటీవైరల్ రీసెర్చ్' పత్రికలో ప్రచురితమయ్యాయి. కేవలం కరోనానే కాకుండా హెచ్ఐవీ, డెంగ్యూ, ఇన్ ఫ్లుయెంజా, జికా వైరస్‌లపైనా ఐవర్ మెక్టిన్ ప్రభావం చూపించినట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వెల్లడించారు.
"ఒక్క డోసు ఇవ్వడం ద్వారా 48 గంటల్లో వైరస్ ఆర్ఎన్ఏను ఐవర్ మెక్టిన్ పూర్తిగా తొలగించింది. నిజానికి 24 గంటల్లోనే చెప్పుకోదగ్గ రీతిలో వైరస్ తగ్గిపోయింది. ఐవర్మెక్టిన్ ను చాలా విరివిగా వాడతారు. ఇది చాలా సురక్షితం. అయితే మనుషుల్లో కరోనా నియంత్రించడానికి డ్రగ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడం మన తర్వాతి లక్ష్యం."-కైలీ వాగ్ స్టాఫ్, శాస్త్రవేత్త, మోనాష్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా
అయితే వైరస్ మెకానిజం ఎలా పనిచేస్తుందో మాత్రం శాస్త్రవేత్తలు స్పష్టంగా వివరించలేదు. ఇతర వైరస్ల చర్యల ఆధారంగా హోస్ట్ కణాల సామర్థ్యాన్ని ఐవర్ మెక్టిన్ తగ్గిస్తుందని చెబుతున్నారు. కొవిడ్-19ను ఎదుర్కోవడానికి ఐవర్ మెక్టిన్ ను ఉపయోగించడమనేది భవిష్యత్తులో నిర్వహించే ముందస్తు-క్లినికల్, క్లినికల్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈనెల 8న విపక్ష నేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్