ప్రస్తతం 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ' ప్రదేశాల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. 'అల్డాబ్రా క్లీన్అప్ ప్రాజెక్టు' పేరుతో పర్యావరణ పరిరక్షకులు ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. ఎంత శుభ్రం చేసినా నిర్వాహకులకు ఇది తలకి మించిన భారంగానే ఉంది.
ప్రపంచలోనే అతి పెద్ద పగడాల దీవులలో ఒకటైన అల్డాబ్రా ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి వన్య ప్రాణిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది.
'అల్డాబ్రా చాలా సురక్షిత ప్రదేశం. కానీ ఈ ప్రదేశాన్ని ఎంత వరకు కాపాడగలం..? చాలా మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ కాలుష్యం వంటివి ఈ ప్రదేశంపై ప్రభావం చూపిస్తున్నాయి."
-జెరిమీ రగుయేన్, పారిశుద్ధ్య నిర్వాహకుడు
అల్డాబ్రా తీరంలో దాదాపు 1000 టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. బాటిల్స్ నుంచి రోజువారీ వాడే ప్లాస్టిక్ సామాన్ల వరకు ఇందులో ఉన్నాయి.
హిందూ మహా సముద్ర తీరం వెంబడి సుమారు 250 కోట్ల మంది జీవిస్తున్నారు. వీరిలో తూర్పు ఆఫ్రికా నుంచి అరేబియన్ ద్వీపకల్పం, భారత్ సహా ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజలు హిందూ సముద్ర తీరాల్లో నివసిస్తున్నారు. వీరి వల్ల కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇండోనేసియా నుంచీ ప్లాస్టిక్ వ్యర్థాలు వేల మైళ్లు ప్రయాణించి ఈ తీరానికి చేరుతున్నాయి.
అల్డాబ్రాలోని పెద్ద తాబేళ్లు సైతం ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు 'క్లీన్అప్ ప్రాజెక్టు' నిర్వాహకులు 22 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు.
పరిశోధకులు ఏడు వారాల పాటు సముద్రంలో 6560 అడుగుల లోతు వరకు సెన్సార్లు ఏర్పాటు చేసి జీవ మనుగడపై దృష్టి సారించారు.