ఊహించిందే అయింది. అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి(September 11 attacks) తర్వాత దాదాపు కనుమరుగైపోయిందనుకున్న అల్‌ఖైదా (Al-Qaeda) మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లతో(Afghanistan Taliban) చేతులు కలిపినట్లు ఇటీవల వార్తలు రాగా.. ఇప్పుడు అది నిజమే అనే తెలుస్తోంది. ఒకప్పుడు అల్‌ఖైదాకు మద్దతు ఇచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు వారి సాయం కోరారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్‌లోని అల్ అరేబియా న్యూస్ ఛానల్ పేర్కొంది.
![Taliban in Attack on Panjshir Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12955172_1.jpg)
ఆ బృందాల్లో అల్‌ఖైదా..
అఫ్గానిస్థాన్‌ను మొత్తం ఆక్రమించినా.. పంజ్‌షేర్ లోయ ప్రాంతం(Panjshir Valley) మాత్రం ఇంకా తాలిబన్ల చేతికి చిక్కలేదు. దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు, అక్కడి నాయకుడు అహ్మద్ మసూద్ (Ahmad Massoud), అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఎదురు తిరగడమే కారణం. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్‌షేర్ తిరుగుబాటు దళం.. తాలిబన్లపై యుద్ధానికి సిద్ధం అని ఎప్పుడో ప్రకటించింది. వారిపై దాడి చేయడానికి వెళ్లిన తాలిబన్లను వందలాది మందిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.
![Taliban in Attack on Panjshir Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12955172_5.jpg)
![Taliban in Attack on Panjshir Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12955172_4.jpg)
ఈ నేపథ్యంలోనే పంజ్‌షేర్‌ను ఎదుర్కోలేని తాలిబన్లు.. అల్‌ఖైదా సాయం కోరారు. పంజ్‌షేర్‌పై దాడికి దిగిన తాలిబన్ బృందాల్లో.. అల్‌ఖైదా ఉగ్రవాదులు ఉన్నారని అక్కడి తిరుగుబాటు దళం చెప్పినట్లు అల్ అరేబియా వార్తా ఛానల్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1(బుధవారం) నుంచే తాలిబన్ ఫైటర్లు, పంజ్‌షేర్ ప్రావిన్స్‌లోని అహ్మద్ మసూద్ తిరుగుబాటు దళం(Resistance Front) మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు పేర్కొంది.
ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా యుద్ధం జరుగుతున్నట్లు తాలిబన్లు ధ్రువీకరించారని టోలో న్యూస్ తెలిపింది. రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది.
పంజ్‌షేర్‌లోని 11 అవుట్‌పోస్ట్‌లు సహా.. షుతుల్ జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబన్ల సాంస్కృతిక కమిటీ సభ్యుడు అనాముల్లా సమంఘాని. మసూద్ దళంలోని 34 మందిని హతమార్చినట్లు టోలో న్యూస్‌కు తెలిపారు.
''పంజ్‌షేర్‌లోని కొన్ని సర్కిళ్లలో.. తాలిబన్ ఫైటర్లపై తిరుగుబాటు దళం దాడి చేసింది. ఇంకా ప్రతిఘటించామని చెప్పింది. తాలిబన్లు.. దాడిని గట్టిగా తిప్పికొట్టారు. నిన్న రాత్రి, ఇవ్వాళ ఉదయం షుతుల్లో జరిగిన ఘర్షణలో అవతలివైపు.. భారీగా ప్రాణనష్టం సంభవించింది.''
- అనాముల్లా సమంఘాని, తాలిబన్ల సాంస్కృతిక కమిటీ సభ్యుడు
తాలిబన్లే హతమయ్యారు..!
తాలిబన్ల ప్రకటనను ఖండించాయి తిరుగుబాటు బలగాలు(Resistance Front). తాలిబన్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్నామని, మొత్తం 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టామని అన్నారు పంజ్‌షేర్ తిరుగుబాటు దళం ప్రతినిధి ఫహీమ్ దాష్ఠి.
![Taliban in Attack on Panjshir Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12955172_3.jpg)
''40 గంటలపాటు తాలిబన్లు.. బాగ్లాన్‌లోని అండరాబ్ వ్యాలీ నుంచి ఖావక్పై దాడులు చేశారు. స్థానిక బలగాలు, పంజ్‌షేర్ దళాలు, ఏఎన్‌ఎస్‌డీఎఫ్ కలిసి దాడుల్ని తిప్పికొట్టాం. ఇప్పటివరకు నాలుగురోజుల్లో 350 మందికిపైగా తాలిబన్లను అంతమొందించాం. 290 మందికిపైగా గాయపడ్డారు. 40 వరకు మృతదేహాలను తాలిబన్లు.. వారి వెంట తీసుకెళ్లారు. ఇంకా చాలా వరకు యుద్ధభూమిలోనే పడిఉన్నాయి.''
- ఫహీమ్ దాష్ఠి, పంజ్‌షేర్ తిరుగుబాటు దళం ప్రతినిధి
అయితే.. పంజ్‌షేర్‌పై తాము నేరుగా దాడి చేయలేదని, అహ్మద్ మసూద్ (Ahmad Massoud) మద్దతుదారుల దాడులకు మాత్రమే ప్రతిస్పందించామని తాలిబన్లు చెప్పడం గమనార్హం.
![Taliban in Attack on Panjshir Valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12955172_2.jpg)
ఇరు వర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయని తాలిబన్ల నాయకుడు.. ఆమిర్ ఖాన్ ముత్తాఖీ చెప్పారు. ఇప్పటికీ.. సమస్య శాంతియుతంగానే పరిష్కారం కావాలని తాము చూస్తున్నట్లు వెల్లడించారు.
తాలిబన్లు, పంజ్‌షేర్ ఫైటర్ల మధ్య యుద్ధంతో ఒరిగిందేం లేదని, ఇరు వర్గాలు చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అమెరికాకు మళ్లీ గుబులు..
డబ్ల్యూటీసీ టవర్లపై దాడికి ముందు ఆల్‌ఖైదా ఉగ్రవాదులకు (Al-Qaeda Terrorists) ఆశ్రయం ఇచ్చింది.. తాలిబన్లే. తాలిబన్, అల్‌ఖైదా భావజాలం ఒకటే. ఇద్దరి ఉమ్మడి శత్రువు అమెరికానే. అఫ్గానిస్థాన్‌లో ఇప్పటికీ అల్‌ఖైదా సానుభూతిపరులు.. అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండూ కలిసిన తరుణంలో అల్‌ఖైదా.. తాలిబన్ల అండతో మళ్లీ పుంజుకుంటుందని అమెరికాకు భయం పట్టుకుంది.
ఇవీ చూడండి: అల్‌ఖైదాకు తాలిబన్ల అండ- అమెరికా గుండెల్లో గుబులు!
Kabul Airport: కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ ఎగిరిన విమానం..!