నేపాల్‌లో రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. సమావేశాలు, చర్చలతో అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా.. బలువతార్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలీతో.. ఎన్సీపీ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రచండ భేటీ అయ్యారు. ఓలి రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ సోమవారం భేటీకానున్న నేపథ్యంలో.. వీరి సమావేశానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతకుముందు.. నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీతో ఆదివారం ఉదయం పుష్ప కమల్.. భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు ఇంకా తెలియరాలేదు.
చిక్కుల్లో ఓలి...
భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓలిపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ఓలి రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడితో సహా చాలా మంది నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారమే స్టాండింగ్ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సోమవారానికి వాయిదా పడింది.
ప్రధాని ఓలి కూడా తన బలగాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనను గద్దెదించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఓలి. ఏదైనా జరగవచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
ఇదీ చూడండి:- ఈ తప్పిదాలతో నేపాల్ స్నేహాన్ని భారత్ కోల్పోతోందా?