కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ఎన్నికలను నిలువరించేందుకు తాలిబన్ల ప్రయత్నాల వేళ అల్లర్ల మధ్యే అఫ్గానిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 37 మంది పౌరులకు గాయలయ్యాయి.
అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన ప్రధాన ప్రత్యర్థి, జాతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లా మధ్య తీవ్రపోటీ నెలకొంది.
పోలింగ్ సందర్భంగా రాజధాని కాబుల్‌ను పాక్షికంగా మూసేశారు అధికారులు. వీధుల్లో ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఓటు వేస్తున్న పౌరులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాలను నగరంలోకి అనుమతించలేదు.
"దేశవ్యాప్తంగా 68 చోట్ల దాడులకు యత్నించారు ముష్కరులు. కానీ భద్రతా సిబ్బంది చాలాచోట్ల దాడులను నియంత్రించారు."
-అసదుల్లా ఖాలీద్, తాత్కాలిక రక్షణమంత్రి
యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గానిస్థాన్‌లో శాంతి స్థాపించే నేత కావాలన్నారు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.
"దేశంలో శాంతి నెలకొల్పేందుకు మా వద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు అవసరమైన అనుమతి, చట్టబద్ధతను ప్రజలు అందించాల్సిందిగా కోరుతున్నాను."
-అష్రఫ్ ఘనీ, అధ్యక్షుడు
ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెలువడనున్నాయి. 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
96 లక్షల మంది పౌరులు ఓటుకోసం నమోదు చేసుకున్నారు. కానీ 18 ఏళ్ల యుద్ధ వాతావరణం అనంతరం దేశాన్ని ఒక్కటి చేసి.. జీవన ప్రమాణాలు పెంచి.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే నేత వస్తారన్న విశ్వాసం ప్రజల్లో కొరవడింది.
ఇదీ చూడండి: 'మెరుపు' దెబ్బకు మూడేళ్లు.. ఉగ్ర శిబిరాలు తునాతునకలు