తాలిబన్ల దురాక్రమణతో(Taliban taking over Afghanistan) దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. వందల సంఖ్యలో ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. కనిపించిన విమానాన్ని ఎక్కేస్తున్నారు. పలువురు విమానం రెక్కలపైకి ఎక్కి ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులను ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.
తాలిబన్లు.. స్వేచ్ఛాయుత, సంఘటిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తమ మాటకు కట్టుబడి ఉంటారని చైనా(China on Afghanistan) ఆశాభావం వ్యక్తం చేసింది. హింస, ఉగ్రవాదానికి తావు లేకుండా శాంతియుతంగా అధికార బదిలీ(Taliban transition of power) చేపడతారని భావిస్తున్నట్లు తెలిపింది. వారితో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. అఫ్గాన్ పౌరుల భద్రతకు తాలిబన్లు పూర్తి బాధ్యత తీసుకుంటారని అనుకుంటున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు.
"అఫ్గానిస్థాన్ పరిస్థితుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అఫ్గాన్ ప్రజల అభిప్రాయాన్ని మేం గౌరవిస్తున్నాం. యుద్ధం ముగిసిందని తాలిబన్లు చేసిన ప్రకటనను గమనించాం. స్వేచ్ఛాయుత, సంఘటిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించారు. ఇది అమలవుతుందని మేం ఆశిస్తున్నాం. అఫ్గాన్ జాతీయ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అఫ్గాన్ తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. రాజకీయ పరిస్థితులు సద్దుమణిగే విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది."
-చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్
'బానిసత్వం ముగిసింది!'
తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Pak PM Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్.. బానిసత్వపు సంకెళ్లు తెంచుకుందని అన్నారు. పాకిస్థాన్‌లోని 1-5వ తరగతి పాఠశాలల్లో జాతీయ స్థాయిలో ఒకే పాఠ్యప్రణాళికను అమలు చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వల్ల విదేశీ సంస్కృతికి బానిసలుగా తయారవుతున్నామని అన్నారు ఇమ్రాన్.
'ఎప్పుడైతే ఇతరుల సంస్కృతిని అలవర్చుకుంటారో.. అప్పుడు దాన్ని మన సంస్కృతి కన్నా గొప్పదని భావిస్తారు. క్రమంగా దానికి బానిసలుగా మిగిలిపోతారు. ఈ విషయంలో అఫ్గానిస్థాన్ ప్రజలు బానిసత్వాన్ని జయించారు,'(Imran khan on afghan crisis) అంటూ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో అంతర్జాతీయ సమాజం కాబుల్‌తో సంప్రదింపులు కొనసాగాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అఫ్గానిస్థాన్ రాజకీయ సుస్థిరత కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి పేర్కొన్నారు. ఆ దేశంలో అంతర్యుద్ధం కొనసాగాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఖాళీ చేస్తున్న దేశాలు..
పరిస్థితులు పూర్తిగా చేయిదాటిన నేపథ్యంలో వివిధ దేశాలు అఫ్గాన్‌లో ఉన్న తమ పౌరులను వెనువెంటనే ఖాళీ చేయించేందుకు(Evacuation in Afghanistan) ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో 1500 మంది ప్రజల్ని అఫ్గాన్ నుంచి తరలించనున్నట్లు యూకే తెలిపింది. తమ దేశానికి సహకరించిన అఫ్గాన్ పౌరులను సైతం తీసుకెళ్లనున్నట్టు వెల్లడించింది.
243 మంది అఫ్గాన్ పౌరులు, వారి కుటుంబాలను తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు పోర్చుగల్ తెలిపింది. నాటో దళాలు తమకు సహకరిస్తాయని తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో పోర్చుగల్ పౌరులెవరూ నివసిస్తున్నట్లు తమకు సమాచారం లేదని పోర్చుగీస్ రక్షణ మంత్రి తెలిపారు.
ఆస్ట్రేలియా
130 మంది ఆస్ట్రేలియా పౌరులను తరలించేందుకు(Australia Evacuation) 250 మంది మిలిటరీతో కూడిన మూడు రవాణా విమానాలు, గాల్లోనే ఇంధనం నింపే జెట్లను అఫ్గాన్‌కు పంపిస్తోంది. పలువురు శరణార్థులను సైతం తీసుకురానున్నట్లు తెలిపింది. ఎంతమందిని తీసుకొచ్చే విషయాన్ని వెల్లడించలేదు.
ఇటలీ
ఇటలీ ఇప్పటికే పలువురు అఫ్గానిస్థాన్ ఉద్యోగులను దేశం నుంచి బయటకు తీసుకొచ్చింది. రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 70 మందిని తరలిస్తున్నట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 228 మంది అఫ్గాన్ పౌరులు, వారి కుటుంబాలను ఇటలీకి తీసుకొచ్చారు. మరో 390 మంది పౌరులు ఇటలీ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని సమాచారం.
స్వీడన్
స్వీడన్ సైతం పలువురు ఉద్యోగులను అఫ్గాన్ నుంచి బయటకు తీసుకొచ్చింది. కాబుల్ నుంచి 19 మందిని ఖతర్‌లోని దోహాకు తరలించినట్లు స్వీడన్ విదేశాంగ మంత్రి తెలిపారు. అక్కడి నుంచి స్వీడన్‌కు చేరుకున్నట్లు వివరించారు.
అంతకుముందు, నార్వే, డెన్మార్క్ దేశాలు సైతం తమతమ సిబ్బందిని అఫ్గాన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశాయి. కాబుల్ విమానాశ్రయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, పౌరులను ఎయిర్‌పోర్ట్‌కు తరలించడం కూడా కష్టమవుతోందని డెన్మార్క్ రక్షణ మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: