భారత్ సహా ఏ ఇతర దేశంతోనూ తాము విరోధాన్ని కోరుకోవడం లేదని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ(Muttaqi Taliban) మరోసారి స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సామరస్య వాతావరణం కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తొలిసారిగా బీబీసీ ఉర్దూకు చెందిన మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తమ ప్రభుత్వం(Afghanistan News) ఏర్పడ్డాక వివిధ రంగాల నుంచి మహిళలను దూరం చేస్తున్నామని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.
'ఆరోగ్య వ్యవస్థలో 100శాతం మహిళా భాగస్వామ్యం ఉంది. విద్యారంగంలోనూ మహిళలు బోధిస్తున్నారు. అవసరమైన అన్ని రంగాల్లో మహిళలు పనిచేస్తున్నారు' అని తాలిబన్(Taliban News) విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ పేర్కొన్నారు. మునుపటి ప్రభుత్వంలో పనిచేసిన ఏ మహిళపైనా ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఇంకా మూసివేసే ఉన్నాయని.. కేవలం కొవిడ్ కారణంగానే అవి మూతబడ్డాయని అన్నారు.
భారత్‌తో సంబంధాలపైనా తాలిబన్ మంత్రి స్పందించారు. అయితే, భారత్‌తో సన్నిహిత సంబంధాలపై చైనా, పాకిస్థాన్‌లు ఏమైనా స్పందించాయా అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. కేవలం మాస్కోలో జరిగిన సదస్సులో భారత్, పాకిస్థాన్‌తో పాటు అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యామని.. ఏ దేశాన్ని కూడా వ్యతిరేకించలేదని బదులిచ్చారు. ఇక పాకిస్థాన్‌లోని అక్కడి ప్రభుత్వం- నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబన్ (TTP) మధ్య తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అంగీకరించారు. అయితే, చర్చల్లో భాగంగా ఇప్పటివరకు ఒప్పందం మాత్రం ఇంకా జరగలేదని తాలిబన్ మంత్రి ముత్తాఖీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే, గతకొంత కాలంగా అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ఎనిమిది దేశాలతో భారత్ జరిపిన చర్చలను తాలిబన్లు స్వాగతించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అఫ్గాన్ వేదికగా ఇతర దేశాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదని ప్రపంచ దేశాలకు మరోసారి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో జరిగిన సమావేశంలో పలు దేశాలు ప్రస్తావించిన అంశాలను ఇప్పటికే నెరవేర్చినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అఫ్గాన్ సంక్షోభ నివారణకు భారత్ జరిపిన చొరవను ప్రశంసిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: