అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు దూసుకెళ్తున్నారు. దోహా ఒప్పందం ప్రకారం అమెరికాసేనలు, నాటో దళాలు ఉపసంహరణ వేళ.. తాలిబన్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. అఫ్గాన్‌లో మెజారిటీ భూభాగం ఇప్పటికే తాలిబన్ల వశమైంది. తాలిబన్ ఉగ్రవాదులతో తలపడలేక ఇప్పటివరకూ 1600మందికి పైగా అఫ్గాన్ సైనికులు పొరుగున ఉన్న తజికిస్థాన్‌కు పారిపోయారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలం పుంజుకోవడం అక్కడి మహిళలను ఆందోళనలకు గురి చేస్తోంది. ఎందుకంటే తాలిబన్లు మానవ హక్కులను అణచివేసి, బహిరంగ ఉరిశిక్షలను సమర్ధిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. టీవీ, సినిమాలు చూడటం, సంగీతం వినడాన్ని తాలిబన్లు ఒప్పుకోరు. 10 సంవత్సరాలు నిండిన పిల్లలు స్కూలుకు వెళ్లడాన్ని కూడా వీరు ఆమోదించరు. అధికారం తాలిబాన్ల చేతికి వస్తే తమ స్వేచ్ఛకు, రక్షణకు భంగం వాటిల్లుతుందని అఫ్గాన్ మహిళలు భయపడుతున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వస్తే తమను ఇంటికే పరిమితం చేస్తారని అఫ్గాన్ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉండదని ఆందోళన చెందుతున్నారు. తాలిబన్ల వలన ఇప్పటికే తమవారిని కోల్పోయామంటున్న అఫ్గాన్ మహిళలు.. భవిష్యత్తులో స్వేచ్ఛను కోల్పోతామని, రక్షణ ఉండదని ఆందోళన చెందుతున్నారు. అయితే మహిళల పట్ల తమ వైఖరి మార్చుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. కానీ తాలిబన్ల మాటలను అఫ్గాన్ మహిళలు నమ్మడం లేదు.
ఇదీ చదవండి:తనకు మాలిన ధర్మమెందుకు?