ఆయనొక పోలీస్ ఉన్నతాధికారి. అఫ్గాన్‌లో ఎన్నో పోరాటాలు చేశారు. అమెరికా సైనికులతో కలిసి చాలా సంవత్సారాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. రాకెట్ లాంచర్‌తో శత్రువులు తనపై జరిపిన గ్రనేడ్ దాడిలో కాలు కూడా పోగొట్టుకున్నారు. అయినా మళ్లీ తిరిగి వచ్చి అఫ్గాన్ పోలీసు దళాలను ముందుండి నడిపించారు. ఈ అధికారి పేరు మహమ్మద్ ఖాలిద్ వర్దక్.
అఫ్గాన్‌లో ఇంతటి గొప్ప పోలీస్ అధికారి పరిస్థితి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నాక(Afghan Crisis) తలకిందులైంది. అతను కనిపిస్తే చంపేందుకు వారు కాబుల్‌లో(Kabul News) ప్రతి ఇల్లూ తిరిగి సోదాలు నిర్వహించారు. దీంతో తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ఖాలిద్.
ఇంతలో తనతో కలిసి పనిచేసిన అమెరికా సైన్యంలోని స్నేహితులు అతని కోసం సాహసం చేసేందుకు ముందుకొచ్చారు. కుటుంబంతో సహా తాము చెప్పిన ప్రదేశానికి వస్తే అందర్నీ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తామని చెప్పారు.
![Afghan officer who fought with US forces rescued from Kabul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825393_img.jpg)
అడుగడుగునా తాలిబన్లు..
కాబుల్‌లో ఎయిర్‌పోర్టు(Kabul Airport) సహా అడుగడుగునా తాలిబన్లు(Afghan Taliban) మోహరించి ఉన్నందున వారి కళ్లు గప్పి తప్పించుకోవడం ఖాలిద్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఎలాగైనా సరే తన వారికి బతికించుకోవాలనే సంకల్పంతో ఎవరకంటా పడకుండా దాచుకుంటూ ముందుకుసాగారు. తాలిబన్లు తమను పసిగట్టలేకుండా కాబుల్‌లో ఒక్కో చోటు నుంచి మరో చోటకు మారారు. ఇలా నాలుగు సార్లు ప్రయత్నించి చివరకు బుధవారం అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు అమెరికా సైన్యం హెలికాప్టర్లో ఖాలిద్ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.
![Afghan officer who fought with US forces rescued from Kabul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825393_img6.jpg)
స్నేహితుల ఆనందం..
ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైనందుకు అమెరికా అధికారి రాబర్ట్ మెక్ క్రీరి సంతోషం వ్యక్తం చేశారు. జార్జ్ వాషింగ్టన్ హయాంలో ఈయన శ్వేతసౌధంలో పనిచేశారు. అఫ్గాన్ సైన్యంతో కలిసి ప్రత్యేక దళాలను ముందుకు నడిపించారు. ఖాలిద్‌కు ఇచ్చిన మాట నిలబెట్టకునేందుకే తాము ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ టీంలో ఖాలిద్‌తో కలిసి పనిచేసిన అమెరికా సైన్యాధికారులు, అతని స్నేహితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
![Afghan officer who fought with US forces rescued from Kabul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825393_img3.jpg)
ఈ ఆపరేషన్ కోసం అమెరికా కాంగ్రెస్ సభ్యులు, రక్షణ, విదేశాంగ శాఖ నుంచి సాయం కోరినట్లు అమెరికా ప్రత్యేక దళాల సర్జంట్ మేజర్ క్రిస్ గ్రీన్ వెల్లడించారు. ఈయన కూడా ఖాలిద్‌తో కలిసి పనిచేశారు. ఆయన కటుంబాన్ని క్షేమంగా తరలించడంపై ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ సహా తమ మిత్ర దేశాలు ఇందుకు సాయం చేశాయని చెప్పారు.
![Afghan officer who fought with US forces rescued from Kabul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825393_img4.jpg)
ఖాలిద్, అతని భార్య, మూడు నుంచి 12ఏళ్ల మధ్య వయసున్న నలుగురు కుమారులు ఇప్పుడు సురక్షితంగా తమ భద్రతలోనే ఉన్నట్లు గ్రీన్ వెల్లడించారు. అయితే అది ఎక్కడ అని మాత్రం చెప్పలేదు.
అఫ్గాన్ ప్రభుత్వం పడిపోవడానికి ముందు(Afghan Crisis) వరకు తన శాయశక్తులా ఖాలిద్ పోరాడారని అమెరికా అధికారులు తెలిపారు. తాలిబన్లు దాడి చేసి ఆయన చుట్టుముట్టారని చెప్పారు. తన లాంటి అనేక మంది అధికారులు నిస్సహాయ స్థితిలో ఒంటరివారయ్యరని వివరించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక వారంతా ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
2013లో ఖాలిద్ సాయం..
![Afghan officer who fought with US forces rescued from Kabul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825393_img5.jpg)
2013లో తూర్పు అఫ్గాన్ వర్దాక్ రాష్ట్రంలో అఫ్గాన్ సైనికుడిగా మారువేషంలో వచ్చిన దుండగుడు అమెరికా సైన్యంపై దాడి చేశాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. అప్పుడే ఔట్‌పోస్టుపై కూడా దాడి జరిగింది. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో అమెరికా కమాండర్.. ఆ సమయంలో ఖాలిద్‌కు ఫోన్ చేశారు. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న అతని దళం.. అమెరికా సైనికులను కాపాడింది.
ఆ తర్వాత 2015లో ఖాలిద్‌పై రాకెట్ లాంచర్‌తో గ్రనేడ్ దాడి జరిగింది. అతని కుడి కాలులో కొంతభాగం కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు అమెరికా సైన్యం అతనికి సాయం చేసింది. మెరుగైన చికిత్స అందించి కృత్రిమ కాలును విదేశాల నుంచి తెప్పించి ఖాలిద్‌కు అందించింది. దీంతో అతను కొద్ది రోజుల తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు.
తమకు శరణార్థుల హోదా ఇవ్వాలని అమెరికా ప్రభుత్వానికి ఖాలిద్ కుటుంబం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్ని రోజులు పడుతుంది, తమకు హోదా లభిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఇదీ చూడండి: Taliban news: తాలిబన్లపై అఫ్గాన్ ప్రజల తిరుగుబాటు!