కరోనాతో పోరాడుతోన్న దేశాలకు సాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతోన్న దేశాలకు మొత్తం 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.29 కోట్లు) సహాయం అందించనున్నట్లు పేర్కొంది.
మనీలా కేంద్రంగా పనిచేస్తోన్న ఆసియా అభివృద్ధి బ్యాంకు... ఫిబ్రవరి మొదట్లో కరోనాతో పోరాడడానికి 2 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తాజాగా మరో 2 మిలియన్ డాలర్లు అందివ్వడానికి ఆమోదం తెలిపింది.
నివారణకు నిధులు
ఏడీబీలో భాగస్వామ్యం ఉన్న అన్ని అభివృద్ధి చెందుతోన్న ఆసియా దేశాలకు ఈ నిధులు అందుబాటులో ఉంటాయి. కరోనాను సమర్థవంతంగా నివారించేందుకు అవసరమయ్యే అన్ని నవీకరణలకు ఈ నిధులను వినియోగించుకునే అవకాశం వాటికి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ పనులు నిర్వహిస్తారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అత్యవసర సామగ్రిని సమకూర్చుకునేందుకు, ఆరోగ్య స్థితిగతులను, భవిష్యత్లో వైద్య వసతులు మెరుగుపరచడానికి అయ్యే ఆర్థికవ్యయాలను అంచనా వేయడానికి ఈ నిధులు అందిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది.
అలాగే ప్రాంతీయంగా మంచి సమన్వయంతో... జంతువులకు, మానవులకు సోకిన వ్యాధులను గుర్తించి, ప్రతిస్పందించి, నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ ఆర్థికసాయం చేసినట్లు స్పష్టం చేసింది
ప్రతిస్పందన సామర్థ్యం బలోపేతానికి
మొదటిగా కంబోడియా, చైనా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాంలకు తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఈ ఏడీబీ నిధులు అందిస్తారు.
కరోనాతో అల్లకల్లోలం అవుతున్న వుహాన్కు ఏడీబీ ప్రైవేట్ రంగ రుణం సీఎన్వై 130 మిలియన్లు అందించింది. అలాగే పీఆర్సీ ఆధారిత జాయింట్ టౌన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ కో లిమిటెడ్ ద్వారా అవసరమైన మందులు, రక్షణ పరికరాల పంపిణీ చేస్తోంది.
కరోనా లానే గతంలో వచ్చిన కొన్ని వ్యాధులు ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలను నాశనం చేశాయి. ముఖ్యంగా పర్యటక రంగంపై ఆధారపడే దేశాలు, అక్కడి వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. వాణిజ్య, సరఫరా గొలుసు కూడా దెబ్బతిందని ఏడీబీ తెలిపింది.
ఇదీ చూడండి: ఎస్బీఐ కార్డు ఐపీఓ రేపే ప్రారంభం.. విశేషాలివే