సోషల్ మీడియాలో యూట్యూబ్ ఒకటి. ఇందులో పాపులారిటీ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలుపడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు మాత్రం ఏం చేయకుండా కేవలం కెమెరా ముందు కూర్చొని బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అక్కడి సోషల్‌మీడియాలో ఆ యువకుడి వీడియోలు, మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అతడిలా వీడియోలు చేసేందుకు మరికొందరూ ప్రయత్నిస్తున్నారు.
2 గంటలపాటు స్తబ్ధంగా.!
చాలా మందిలాగే ఇండోనేషియాకు చెందిన మహ్మద్ దిదిత్ ఓ యూట్యూబర్. ఇతడు కూడా యువత కోసం ప్రత్యేకమైన వీడియోలు చేస్తుంటాడు. అయితే ఇటీవల ఏం చేయాలో తెలియక 2 గంటల పాటు కంప్యూటర్ కెమెరా ముందు ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్ చేశాడు. రికార్డింగ్ సమయంలో ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా కనీసం కదలకుండా అలాగే కూర్చున్నాడు. అలా 2 గంటలు ఏం చేయకుండా తీసిన వీడియోను '2 అవర్స్ ఆఫ్ డూయింగ్ నథింగ్' పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతే.. ఆ వీడియో తెగ పాపులర్ అయింది.
అప్‌లోడ్ చేసిన కొన్నిరోజుల్లోనే 20లక్షల వ్యూస్ వచ్చాయి. అతడి వీడియోపై పేరడీలు, మీమ్స్ వచ్చాయి. దీనిని ఓ ఛాలెంజ్‌లా తీసుకొని మరికొందరు మహ్మద్‌లా 2 గంటలు ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతే కాదు.. ఆ రెండు గంటల్లో అతడు ఎన్నిసార్లు కనురెప్పలు కొట్టాడో లెక్కపెట్టి కామెంట్లు చేస్తున్నారు.
తమాషాగా మొదలుపెట్టి..
నిజానికి ఈ వీడియోని మహ్మద్ కేవలం 5 నుంచి 10 నిమిషాలపాటే చేయాలనుకున్నాడట. కానీ అలా కూర్చొడం బాగుందనిపించి.. రెండు గంటలు కొనసాగించాడు. స్థానిక మీడియా ఈ వీడియో గురించి మహ్మద్‌ను ఇంటర్వ్యూలు చేస్తున్నాయట. అలా మహ్మద్ ఉన్నపళంగా ఫేమస్ అయిపోయాడు. తమషాగా చేసినా.. ఇప్పుడు వచ్చిన ఈ పాపులారిటీకి మహ్మద్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు.
ఇదీ చదవండి: వావ్ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట