పాకిస్థాన్‌వ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు జరుగుతున్న వేళ ఆత్మాహుతి దాడి 10 మందిని బలిగొంది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం లాహోర్‌లోని సుఫీ ప్రార్థనా మందిరం దాతా దర్బార్ ఎదుట ఈ ఘటన జరిగింది.
పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా 10 మంది మృతి చెందారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు పోలీసుల పరిస్థితి విషమంగా ఉంది.
దాడి సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ప్రార్థనా మందిరాన్ని ఖాళీ చేయించారు. సహాయక చర్యలు చేపట్టారు.
2010లో ఇదే ప్రార్థనా మందిరం వద్ద జరిగిన పేలుడులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
దాడిని ఖండించిన ప్రధాని
దాతా దర్బార్ ఎదుట జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చూడండి: ఎన్ఆర్సీ గడువు పొడిగింపునకు సుప్రీం నిరాకరణ