పాకిస్థాన్ ఖైబర్ పంఖ్తుంఖ్వా రాష్ట్రంలోని హిందూ దేవాలయం కూల్చివేత కేసులో మరో 45 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 100కు చేరింది. అనుమానితులైన మరో 350 మంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 మంది పోలీసులను జిల్లా పోలీస్ అధికారి కరాక్ ఇర్ఫానుల్లా మారవత్ సస్పెండ్ చేశారు.
'దేవాలయాన్ని నిర్మిస్తాం'
దేవాలయాన్ని కూల్చిన స్థలంలోనే నూతన ఆలయాన్ని నిర్మిస్తామని ఖైబర్ పంఖ్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి మహమ్మద్ ఖాన్ హామీ ఇచ్చారు. దేవాలయంతో పాటు హిందూ నేత స్మారకాన్ని సైతం నిర్మిస్తామన్నారు. ఈ మేరకు ఆలయ పునర్నిర్మానానికి తీసుకోవాల్సిన చర్యలపై నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. కేవలం 10 రోజుల్లోనే ఆలయ నిర్మాణం పూర్తవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఇదీ చదవండి : పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన అల్లరిమూక
గత బుధవారం రాడికల్ ఇస్లామిక్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీనిపై స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకొని యాంటీ టెర్రరిస్ట్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి మూడు రోజుల రిమాండ్ విధించింది. దేవాలయంతోపాటు స్థానిక హిందూ నేత స్మారకాన్ని కూడా దుండగులు కూల్చివేశారు. కొన్ని రోజుల క్రితమే దీనిని వేరేచోట నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. విగ్రహాన్ని తరలించేందుకు అనుమతి ఉన్నప్పటికీ తమకు చెప్పకుండా కూల్చినందుకు హిందూవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాక్లో గుడి కూల్చివేతపై భారత్ నిరసన
స్థానిక "జమైత్ ఉలేమా ఇస్లామ్" పార్టీకి చెందిన నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యను మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, హిందు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ ఘటనపై పాక్ సుప్రీంకోర్టు సైతం స్పందించింది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను జనవరి 5న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఘటనపై భారత్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ దౌత్యాధికారులు పాక్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి : పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో 30 మంది అరెస్టు