తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ సైనికుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటిలో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. సరిహద్దులకు ఇరువైపులా రెండు దేశాల సైనికుల మోహరింపు రానున్న శీతాకాలంలోనూ కొనసాగే అవకాశమే మెండుగా ఉంది.
80 నిమిషాల్లో 300 వంటకాలు
ఈ నేపథ్యంలో అత్యంత కఠిన పరిస్థితలు ఉండే హిమాలయాల్లో విధులు నిర్వహించే తమ జవాన్లకు ఎలాంటి ఆలస్యం జరగకుండా వేడివేడి ఆహార పదార్థాలను అందించేందుకు చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జూన్ నెల నుంచి ఆర్మీలోని వంట విభాగానికి చెందిన 8 మందికి హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో శిక్షణను నిర్వహిస్తోంది. ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే 80 నిమిషాల్లో 300 రకాల వంటకాలను సిద్ధం చేసేలా తర్ఫీదునిస్తున్నారని చైనా అధికార పత్రిక ఒకటి వెల్లడించింది.
పొగలుకక్కే ఆహారం అందించడమే లక్ష్యం
76వ ఆర్మీ గ్రూప్‌నకు చెందిన కొందరు సైనికులు ఈ వంటవాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సముద్ర మట్టానికి 4,600 మీటర్ల ఎత్తులోని ఓ ప్రదేశంలో వంటవాళ్లు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను హాట్ప్యాక్లలో అమర్చి వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సైనికులకు చేరవేయాల్సి ఉంటుంది. ఆహారం వారికి చేరేసరికి పొగలు కక్కుతూ వేడిగా ఉండాలి. సకాలంలో, సక్రమంగా అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై కూడా శిక్షణ ఉంటుంది.
50 వేల మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 370 అధికరణ రద్దు.. భావోద్వేగ విలీనం