ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2.07 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 7.34 లక్షల మంది చనిపోగా.. 1.29 కోట్ల మంది కోలుకున్నారు.
నేపాల్లో..
నేపాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 338 మంది వైరస్ బారిన పడగా మొత్తం సంఖ్య 23,310కి చేరింది. ఇప్పటివరకు ఈ దేశంలో 79 మంది మరణించారు. అయితే ఇందులో 16,493 మంది కోలుకున్నట్లు నేపాల్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ జగేశ్వర్ గౌతమ్ వెల్లడించారు.
ఫిలిప్పీన్స్లో భారీగా..
ఫిలిప్పీన్స్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,958 కేసులు నమోదు కాగా మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 1.36 లక్షలకు చేరింది.
అమెరికా ఖండంలో..
అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రెండు అమెరికా ఖండాల్లో కలిపి రోజుకూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇక్కడ అధికంగానే ఉంది. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
న్యూజిలాండ్ తరహాలో..
ఈ వారంలో కరోనా మరణాల సంఖ్య 7.5 లక్షలు దాటుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథి టెడ్రోస్ అధనోమ్ అంచనా వేశారు. ఇది బాధాకరమైన విషయమే అయినా గణాంకాలు ఇదే చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. న్యూజిలాండ్ తరహాలో అన్ని దేశాలు కట్టడి చర్యలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
దేశం | కేసులు | మరణాలు | కోలుకున్నవారు |
అమెరికా | 52,01,064 | 1,65,620 | 26,64,980 |
బ్రెజిల్ | 30,35,582 | 1,01,136 | 21,18,460 |
రష్యా | 892,654 | 15,001 | 6,96,681 |
దక్షిణాఫ్రికా | 5,59,859 | 10,408 | 4,11,474 |
మెక్సికో | 4,80,278 | 52,298 | 3,22,465 |
పెరూ | 4,78,024 | 21,072 | 3,24,020 |
ఇదీ చూడండి: కరోనా నియంత్రణ కష్టమే: డబ్ల్యూహెచ్ఓ