న్యూజిలాండ్‌లో నిత్యం పర్యటకులతో కళకళలాడే వైట్ ఐలాండ్‌లోని ఓ అగ్నిపర్వతం ఇవాళ విస్ఫోటనం చెందింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు. మరికొందరు గల్లంతై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనంతో పొగ, దుమ్ము, ధూళి కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించాయి.
జోరుగా సహాయక చర్యలు...
అగ్నిపర్వతం పేలిన ప్రాంతంలో జోరుగా సహాయక చర్యలు సాగుతున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సమీప ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హెచ్చరికలు బేఖాతరు!
న్యూజిలాండ్ ప్రధాన భూభాగం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వైట్ ఐలాండ్ ఉంది. ఈ ద్వీపాన్ని స్థానిక మావోరీ భాషలో వాకారి అని కూడా పిలుస్తారు. ఇక్కడి అగ్నిపర్వతం క్రియాశీలంగా ఉందని ఇటీవలే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినప్పటికీ అక్కడికి పర్యటకులను అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై వాడీవేడి చర్చ