మయన్మార్లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై హింస పెరిగిపోతోంది. ఆందోళన చేస్తున్న పౌరులపై భద్రతా దళాలు ఆదివారం జరిపిన దాడుల్లో కనీసం 38 మంది మరణించారు. అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) నివేదిక ప్రకారం ఇప్పటివరకు 126 మంది పౌరులు మయన్మార్ హింసలో ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకూ ఈ హింసాకాండ పెచ్చరిల్లుతోంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. మార్చి 14 వరకు ఉన్న సమాచారం ప్రకారం 2,156 మందిని భద్రతా దళాలు అరెస్టు చేయగా.. 1,837 మంది ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు.
నిరసనకారులను అణచివేసేందుకు పలు ప్రాంతంలో నిజమైన ఆయుధాలు, మందుగుండును ఉపయోగిస్తున్నారని ఏఏపీపీ తెలిపింది. ఈ ప్రాంతాలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయని పేర్కొంది. యాంగూన్లోని లయింగ్ ప్రాంతంలోనే 22 మంది పౌరులు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని తెలిపింది. విద్యార్థులు, యువతపై కాల్పులకు తెగబడటమే కాకుండా.. ఫ్యాక్టరీలు, పలు కార్యాలయాలకు బలగాలు నిప్పంటిస్తున్నాయని వెల్లడించింది.
ఖండించిన ఐరాస రాయబారి
మరోవైపు, దేశంలో జరుగుతున్న రక్తపాతాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రత్యేక రాయబారి క్రిస్టీన్ ష్రానర్ బర్జనర్ ఖండించారు. సైన్యం అరాచకాలపై వ్యక్తిగతంగా తనకు సమాచారం అందిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు శాంతి, సుస్థిరతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అన్నారు. మయన్మార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా మండలి సభ్యులతో పాటు, ఇతర ప్రాంతీయ దేశాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రభుత్వ నేతలను నిర్బంధించింది. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది.
ఇదీ చదవండి: మయన్మార్ సైన్యం చేతిలో మరో పది మంది బలి