ఇండోనేసియా పశ్చిమ కలిమంటన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 18 మత్యకారుల బోట్లు తుపాను ధాటికి మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది ఆచూకీ గల్లంతైంది.
తుపాను ముప్పుపై అధికారుల హెచ్చరికలతో రెండు టగ్ బోట్లు, కొన్ని ఫిషింగ్ నౌకలు తీరానికి చేరుకున్నాయని, మరికొన్ని తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి యోపి హర్యాది తెలిపారు. ప్రమాదానికి గురైన బోట్లలోని మొత్తం 83 మందిని కాపాడినట్లు చెప్పారు.
మరో మూడు రోజుల పాటు గాలింపు చర్యలు కొనసాగుతాయని సహాయక బృందాల సభ్యులు తెలిపారు. అయితే.. వాతావరణంలో వస్తున్న మార్పులు సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో ఓ హెలికాప్టర్, విమానం, పలు బోట్లను వినియోగిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: బోటు మునిగి 43 మంది మృతి!