సైబీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రష్యాలోని చీతా నుంచి శ్రితెన్స్క్ వెళ్తుండగా బస్సు అదుపు తప్పి వంతనపైనుంచి గడ్డకట్టిన కువెంగా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మందికి గాయాలయ్యాయి.
ఘటనా స్థలికి చేరుకొని రక్షక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ముందు చక్రం ఫెయిల్ అవ్వటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
బాధిత కుటుంబాలకు రష్యా ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.
రష్యాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏటా 20 వేల మందికిపైగా అక్కడ ఇలాంటి ఘటనల్లో మరణిస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి: ఎన్సీపీకే కీలక 'మహా' మంత్రి పదవులు!