నిరసనలతో అట్టుడుకుతోన్న ఇరాక్‌లో ఆందోళనలు మంగళవారం మరింత తీవ్రమయ్యాయి. కర్బాలా నగరంలో ఆందోళనకారులపై ఇరాక్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. దాదాపు 800 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఇరాక్ ప్రజలు వరుసగా ఐదోరోజు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టిన నేపథ్యంలో.. ఈ కాల్పులు జరిగాయి. కర్బాలాలోని ఎడ్యుకేషన్ స్క్వేర్‌లో ఆందోళన చేపట్టిన వారిపై కారులో వచ్చిన వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నల్లదుస్తులు, మాస్క్‌లు ధరించిన భద్రతా దళాలు నిరసనకారులపై భీకర కాల్పులు జరిపినట్లు చెప్పారు.
శుక్రవారం ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో ఇప్పటివరకు దాదాపు 90 మంది నిరసనకారులు మరణించారు. ఈ నెల మెదట్లో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో 149 మంది బలయ్యారు.