శీతాకాలంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించనుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శీతాకాలం సెలవుల నేపథ్యంలో కుటుంబ వేడుకలు, ఇండోర్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సరైన కరోనా నిబంధనలు లేవని నిపుణులు భావిస్తున్నట్లు గార్డియన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
రోజుకు 2 లక్షల కేసులు!
మహమ్మారిపై అమెరికా వ్యూహాలు సన్నగిల్లాయని విద్యాసంస్థ అధిపతి కార్లోస్ డెల్రియో తెలిపారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు.
అమెరికా అతిపెద్ద విపత్తును ఎదుర్కోబోతోందని బ్రౌన్ విశ్వవిద్యాలయం వైద్యురాలు మేగన్ రాన్నీ తెలిపారు. వచ్చే రెండు నెలల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనే విషయంపై అమెరికా భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.
రికార్డు స్థాయిలో..
ప్రపంచ దేశాలతో పోలిస్తే అమెరికాలో వైరస్ వ్యాప్తి భారీగా ఉంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1.25 లక్షల మందికి వైరస్ సోకింది. ఇప్పటికే దేశంలో కోటికిపైగా కేసులు నమోదు కాగా 2.44 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క కేసుతో 8వేల మందికి పరీక్షలు..
చైనా వాణిజ్య నగరం షాంఘైలో కరోనా కలకలం చెలరేగింది. షాంఘైలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. సుమారు 186 మందిని క్వారంటైన్‌కు తరలించారు. 8 వేల మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగికి వైరస్ ఎలా సోకిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అమెరికాలోని ఆ రాష్ట్రంలో మిలియన్ కరోనా కేసులు