పర్యావరణంలో వస్తోన్న మార్పులకు పరిష్కారం చూపాలంటూ ప్రపంచం ఏకమై నినదిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రీటా థంబర్గ్ ఇచ్చిన పిలుపుతో సెప్టంబర్ 20 నుంచి వారం రోజుల పాటు 'గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్' పేరుతో 156 దేశాల ప్రజలు కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని ఆందోళనలు చేశారు. ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు ముందే తమ ఉద్దేశాన్ని దేశాధినేతలకు వినిపించేందుకు థింబర్గ్ ప్రపంచవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.
దిల్లీలో హొరెత్తిన నిరసనలు
దిల్లీలో తొలిరోజు నిర్వహించిన గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్‌లో విద్యార్థులు, పర్యావరణవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు ఆందోళనలు చేపట్టారు. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే జీవించేందుకు మరొక గ్రహం కూడా లేదని ప్లకార్డులు చేతపట్టి, పది తలల రావణాసురుడి దిష్టిబొమ్మను ప్రదర్శించారు.
వాయు ఉద్గారాలను తగ్గించాలి
ఆస్ట్రేలియాలో 10 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ప్రదర్శన చేపట్టారు. దేశంలో అధికంగా బొగ్గు, సహజ వాయువు ఎగుమతి ఉన్నందున గ్రీన్ హౌస్ తీవ్ర ప్రభావానికి గురవుతోందని గళమెత్తారు. వాయు ఉద్గారాలను వీలైనంత త్వరగా తగ్గించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాంకాగ్లో నిరసన హోరు
హాంకాంగ్‌లోనూ వాతావరణ మార్పులపై నిరసనకారులు ప్రదర్శనలు చేపట్టారు. పర్యావరణం మార్పుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
విద్యాసంస్థలు బంద్
చెక్ రిపబ్లిక్లో అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం విద్యార్థులు బంద్‌కు పిలుపునిస్తూ పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.
ఇదీ చూడండి:'సైనిక చర్యలకు పాల్పడితే.. యుద్ధమే'