Covid cased USA today: అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో.. రికార్డుస్థాయిలో 5,65,987 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఆ దేశంలో కేసుల సంఖ్య 5.5కోట్లు దాటింది. తాజాగా 1,354 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య దాదాపు 8.46లక్షలకు చేరింది.
అటు ఐరోపానూ కొవిడ్ వణికిస్తోంది. బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 1.89లక్షల కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 1.2కోట్లకు చేరింది. ఫ్రాన్స్‌లో ఏకంగా 2.06లక్షల కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ కేసుల సంఖ్య 97.4లక్షలు దాటింది. జర్మనీలో కొత్తగా 41వేలు, స్పెయిన్‌లో 1.6లక్షలు, ఇటలీలో 1.2లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి.
Russia covid cases: రష్యాలో కొత్తగా 21,073 కేసులు నమోదయ్యాయి. 926మంది వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,04,79,344కు పెరగ్గా.. మృతుల సంఖ్య 3లక్షలు దాటింది. కాగా.. ఒక్క నవంబర్ నెలలో అక్కడ 87,500 కేసులు వెలుగుచూశాయని, కరోనా మహమ్మారి తొలి నాటి నుంచి ఒక నెలలో ఈస్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న వారికి టీకా నాలుగో డోసు ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
అటు ఒమిక్రాన్ పుట్టినిల్లు దక్షిణాఫ్రికాలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేశారు. కొవిడ్ కట్టడి కోసం రెండేళ్ల క్రితం అమలుచేసిన కర్ఫ్యూను తొలగిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'ఒమిక్రాన్‌తో కరోనా కేసుల సునామీ'