ఫిన్లాండ్(Finland happiest country).. ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. పేరుకు చిన్న దేశమైనా సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు వనరులన్నీ ఉన్నా.. పని చేసే జనాభా తక్కువ. దీంతో దేశ అభివృద్ధి కుంటుపడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు ఏ దేశపౌరులైనా తమ దేశం వచ్చి పని చేస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తోంది ఫిన్లాండ్(Finland happiest country).
జనాభా రేటు తక్కువే..
సాధారణంగా పశ్చిమ ఐరోపా దేశాల్లో జనాభా వృద్ధి రేటు కాస్త తక్కువే. ఫిన్లాండ్ ప్రస్తుత జనాభా 5.2 మిలియన్లు. అందులో పని చేయగలిగే వయస్సులో ఉన్నవారు 65 శాతం మంది మాత్రమే. 39.2 శాతం ఓల్డేజ్ డిపెండెన్సీ నిష్పత్తితో వృద్ధుల సమస్య అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి ఇది 47.5 శాతానికి పెరగొచ్చు. ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్యను పెంచుకునేందుకు ఫిన్లాండ్(Finland happiest country) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాలంటే ఏడాదికి కనీసం 20 వేల నుంచి 30 వేల మంది తమ దేశానికి వలస రావాలని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టింది.
విదేశీయులను తమ సంస్థల్లో నియమించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు నిబంధనలను సరళతరం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపించిన వారికి ఫిన్లాండ్ పౌరసత్వం ఇచ్చి ఆహ్వానిస్తోంది. లేదంటే అక్కడ పని చేసేందుకైనా ఇమ్మిగ్రేషన్ సదుపాయం కల్పిస్తోంది.
అవినీతి చాలా తక్కువ
నాణ్యమైన జీవనం సాగించాలనుకునేవారికి ఫిన్లాండ్ ఓ చక్కటి దేశం. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉంటాయి. స్వతంత్రత, లింగ సమానత్వం ఉంటుంది. అవినీతి, కాలుష్యం, నేరాలు కూడా దాదాపు లేవనే చెప్పవచ్చు. దీంతో చాలామంది అక్కడ నివసించేందుకు ఇష్టపడతారు. కేవలం ఫిన్లాండ్ మాత్రమే కాదు.. చాలా పశ్చిమ ఐరోపా దేశాలు తమ దేశానికి వలసలను స్వాగతిస్తాయి. ఇతర దేశాల వారికి కూడా తమ దేశంలో ఉద్యోగాలు కల్పిస్తాయి.
పెరిగిన వలసలు..
గత దశాబ్దకాలంలో ఫిన్లాండ్‌కు వలస వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ దేశానికి వచ్చిన వారు కొన్నేళ్లపాటు అక్కడ పని చేసి తిరిగి స్వదేశానికి వెళ్లిపోతుంటారు. అలా 2019లో ఫిన్లాండ్‌ని(Finland happiest country) విడిచి వెళ్లిన వారికంటే దాదాపు 15 వేల మంది అదనంగా ఆ దేశానికి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆ దేశాన్ని విడిచి వెళ్లినవారిలో విద్యావంతులే ఎక్కువమంది ఉండటం ఆ దేశ అభివృద్ధిని దెబ్బతీస్తోంది.
కరోనా పడగ
ఉద్యోగరీత్యా ఆ దేశానికి వచ్చిన పలువురు కరోనా నేపథ్యంలో స్వదేశానికి పయనమవుతున్నారు. ఇది కూడా ఫిన్లాండ్ పాలిట శాపంగా మారింది. స్టార్టప్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించినా, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక.. తిరిగి ఫిన్లాండ్ పూర్వపు శోభను సంతరించుకుంటుందని అక్కడి నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
సంతోషకరమైన దేశం ఎలా?
ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి.. ప్రపంచ దేశాల్లో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను ఏటా నిర్ణయిస్తుంది. ఆ జాబితాలో ఫిన్లాండ్(Finland happiest country) గత నాలుగేళ్లుగా ప్రథమ స్థానంలోనే నిలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో సర్వే నిర్వహిస్తారు. ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత, లంచగొండితనం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని హ్యాపీనెస్ ఇండెక్స్‌ను తయారు చేస్తారు.
ఇదీ చూడండి: అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బల ప్రదర్శన