Worlds biggest space telescope: విశ్వం సవాళ్లను స్వీకరిస్తూ అంతరిక్ష చిక్కుముళ్లను విప్పేందుకు మహా విశ్వదర్శని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు JWST నింగిలోకి దూసుకెళ్లింది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. కాలంలో వెనక్కి వెళ్లి విశ్వం పుట్టుక తొలినాళ్లల్లో ఏర్పడిన గెలాక్సీలను ఈ వెబ్‌స్పేస్ శోధించనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన JWSTను అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.
James webb space telescope
వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ప్రపంచంలోనే అతిపెద్దది. శక్తిమంతమైనది. ఇది సేకరించే సమాచారం గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 13 వందల 50 కోట్ల సంవత్సరాల కిందట విశ్వం ఆవిర్భవించిన వెంటనే చీకట్లను చీల్చుకుంటూ ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, పాలపుంతలను ఈ అధునాతన సాధనం ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. తద్వారా బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలినాటి నక్షత్ర మండలాలను నేటి భారీ స్పైరల్, దీర్ఘవృత్తాకార గెలాక్సీలతో పోల్చి చూస్తారు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావానికి కారణమయ్యే భారీ ధూళి మేఘాల లోపలి అంశాలనూ పరిశీలిస్తారు. గ్రహాలపై ఎలాంటి అణువులు ఉన్నాయో కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోపు పరిశీలించగలదు.
ఇతర గ్రహాలపై జీవం గుర్తులను శోధించడంలో జేమ్స్ వెబ్ టెలిస్కోపు సహాయపడనుంది అలాగే మన పాలపుంతలోని నక్షత్రాల వద్ద ఉన్న గ్రహాలను, వాటి ఆవాసయోగ్య పరిస్థితులను ఇది గుర్తిస్తుంది. ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల్లోని రసాయన తీరుతెన్నుల గురించి ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు తెలుసుకోనున్నారు. ఇతర గ్రహాల్లో కార్బన్ డైఆక్సైడ్, మిథేన్‌కు మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ద్వారా గుర్తించనున్నారు.
Big space telescope
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా , యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ , కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను అభివృద్ధి చేశాయి. 21 అడుగుల పొడుగు ఉండే ఈ వెబ్ టెలిస్కోప్ తయారీకి సుమారు 75 వేల కోట్లు ఖర్చు అయ్యాయి.
జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోపు ప్రైమరీ మిర్రర్‌ను.. బంగారం పూతతో తయారు చేశారు. ఇది 6.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. 1990లో రోదసీలోకి ప్రవేశపెట్టిన విప్లవాత్మక హబుల్ స్పేస్ టెలిస్కోప్‌నకు కొనసాగింపుగా ఇది రోదసిలోకి అడుగుపెట్టబోతోంది.
అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతి పెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే ఇది రెండున్నర రెట్లు పెద్దది. కంటితో కనిపించే నక్షత్రాలను ఈ టెలిస్కోప్ సాయంతో వెయ్యి కోట్ల రెట్ల స్పష్టతతో వీక్షించవచ్చు. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ టెలిస్కోప్ చిత్రాలను తీస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూపాయి నాణేన్ని సైతం స్పష్టంగా చూపించగలదు.
ఇదీ చదవండి: