మానవాళిపై తన ఉడుం పట్టును కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింతగా బిగిస్తోంది. అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రతిరోజు వేలమందిని తన విషపు కౌగిలి బాధితుల జాబితాలో చేర్చుకుంటోంది. ఇటీవలి వరకు కాస్త తేరుకున్నట్లే కనిపించిన దక్షిణ కొరియాలో కేసులు మళ్లీ పెరుగుతుండటమూ ఆందోళన కలిగిస్తోంది. మెక్సికోలో తాజాగా 24 గంటల్లో 501 మంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. 3,455 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ సగటున రోజుకు 800 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు.
రెండోస్థానంలో బ్రెజిల్
రష్యాలో తాజాగా 24 గంటల్లో 8,338 మందికి వైరస్ సోకింది. 161 మంది మరణించారు. వీటితో కలిపి రష్యాలో మొత్తం కేసులు 3,70,680కి చేరాయి. బ్రెజిల్‌లోనూ మొత్తం 4,14,661 మందికి వైరస్ సోకింది. చిలీలో దాదాపుగా ప్రతిరోజు నాలుగు వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ దేశంలోని ఆస్పత్రుల్లో ఐసీయూ విభాగాలన్నీ నిండిపోవడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో దాదాపుగా ప్రతిరోజు 500కుపైగానే మరణాలు నమోదవుతున్నాయి. జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడేందుకు తాము సమీప భవిష్యత్తులో అనుమతులిచ్చే అవకాశాల్లేవని వాషింగ్టన్ మేయర్ బౌసర్ చెప్పారు. వచ్చే నెల 4 నుంచి కాసినోలు తెరుచుకునేందుకు అనుమతిస్తామని నెవడా గవర్నర్ స్టీవ్ సిసోలక్ తెలిపారు. దక్షిణ కొరియాలో తాజాగా 40 మంది కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. గత 50 రోజుల్లో అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. కొత్త కేసుల్లో 36 ఒక్క సియోల్ ప్రాంతంలోనివే కావడం గమనార్హం.
న్యూజిలాండ్ ఆస్పత్రుల్లో బాధితులు సున్నా
న్యూజిలాండ్‌లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లే కనిపిస్తోంది. తమ దేశంలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆ వ్యాధి బాధితులెవరూ చికిత్స పొందడం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే- ఇప్పటికీ ఆ దేశంలో 21 క్రియాశీల కేసులున్నాయి. సదరు బాధితులకు ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వచ్చే నెల 9 నుంచి తమ దేశంలోకి పర్యాటకులను అనుమతించనున్నట్లు సైప్రస్ ప్రకటించింది. విదేశీయులెవరైనా తమ దేశంలో వైరస్ బారిన పడితే.. వారికి ఉచిత ఆహారం, ఆశ్రయం, చికిత్స అందిస్తామని వెల్లడించింది.
ఇదీ చూడండి : పోలీసు కర్కశం- నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి..