కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజూ అనేక దేశాల్లో వందల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత 12 రోజుల్లో లక్ష కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
చైనా కేంద్రబిందువుగా గతేడాది డిసెంబర్లో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. అనంతరం మూడు నెలల వ్యవధిలో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. కానీ గత 12 రోజుల వ్యవధిలో ఈ సంఖ్య 2 లక్షలు దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 2,46,275 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రాణాంతక వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది.
ఆఫ్రికా, తూర్పు మధ్యధరా, ఐరోపా, అమెరికా ఖండాల్లోని ఏడు దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అలాగే అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో.. కరోనా వ్యాప్తిపై విస్తృత అధ్యయనం చేస్తున్నట్లు, నివారణ చర్యలను చేపడుతున్నట్లు కూడా స్పష్టం చేసింది.
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఎంతలా అంటే చైనాను మించి మరణాలు పెరిగిపోతున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 271 కరోనా కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. ఆఫ్రికాను కూడా కరోనా కబళిస్తోంది. ఒక్క వారంలోనే అక్కడ కరోనా కేసులు ఆరురెట్లు పెరిగి 850కి చేరుకున్నాయి. ఇప్పటివరకు ఈజిప్టులో 210, దక్షిణాఫ్రికాలో 202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాకు యువతేమీ అతీతం కాదు...
ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్ యువత మీద పెద్దగా ప్రమాదం చూపదన్న వాదన ప్రచారంలో ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ మాత్రం.. యువత కూడా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో వృద్ధులే మరణించడం వల్ల ఇలాంటి భావన ఏర్పడిందని తెలిపారు. కానీ, వైరస్‌కు యువత అతీతులేం కాదని స్పష్టం చేశారు.
సామాజిక దూరమే కాదు.. భౌతిక దూరం కూడా..
ఇప్పటి వరకు సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) గురించి మాత్రమే మాట్లాడుకున్న మనం ఇకపై భౌతిక దూరం(ఫిజికల్ డిస్టెన్సింగ్)పైనా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కచ్చితంగా దూరం పాటించాలని సూచించారు. నేరుగా కలవకుండానే సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. దానికి అనేక మార్గాలున్నాయని గుర్తుచేశారు. పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల వైరస్ ముప్పు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై ఐరాస ఏమందంటే?