ప్రపంచంలోని 165 మందితో కూడిన అగ్ర నాయకుల బృందం కరోనా వైరస్ పోరాట నిధిని సమన్వయం చేసేందుకు జీ-20 దేశాలు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వీరిలో 92 మంది మాజీ అధ్యక్షులు, ప్రధానమంత్రులతో పాటు ఆర్థిక, ఆరోగ్య నిపుణులు ఉన్నారు.
ఈ మేరకు జీ-20 దేశాల అధినేతలకు ఈ బృందం లేఖ రాసింది. వీరిలో భారత్ నుంచి ఆర్థిక వేత్తలు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, కౌశిక్ బసు ఉన్నారు. కరోనా పోరాటంలో భాగంగా అత్యవసరంగా సమావేశమై.. అంతర్జాతీయ నిధిని సమన్వయం చేసే టాస్క్ఫోర్స్పై చర్చించాలని కోరారు.
"ఆరోగ్య అత్యయిక స్థితికి పరిష్కారం దొరికే వరకూ ఆర్థిక పరిస్థితి మెరుగపడదు. ఏదో ఒక దేశంలో వ్యాధి తీవ్రత తగ్గితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు కాదు. అన్ని దేశాల్లో వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావాలి. అందుకోసం అత్యవసర నిధిని సమకూర్చాల్సిన అవసరం ఉంది."
- ప్రపంచ నేతలు
అంశాల వారీగా వివిధ రకాలుగా ప్రపంచానికి సాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ నాయకుల బృందం వివరించింది.
- వ్యాక్సిన్, చికిత్స, ఔషధాల కోసం 8 బిలియన్ డాలర్లు
- వైద్య వ్యవస్థ (వెంటిలేర్లు, పీపీఈలు) కోసం 35 బిలియన్ డాలర్లు
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య, ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు 150 బిలియన్ డాలర్లు
- పేద దేశాలకు రుణ వడ్డీల చెల్లింపుల కోసం 44 బిలియన్ డాలర్లు
- ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా ఉద్దీపన చర్యలు
ద్రవ్య సంక్షోభం.. దివాలా పరిస్థితికి మారకుండా ఈ చర్యలు అవసరమని తెలిపారు నేతలు. మాంద్యం తలెత్తితే అంతర్జాతీయంగా కుంగుబాటు తప్పదని హెచ్చరించారు. వీటిని ఎదుర్కొనేందుకు ఆర్థిక, ద్రవ్య, కేంద్ర బ్యాంకులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ఐరాస, జీ-20 దేశాలతోపాటు ఇతర ముఖ్యమైన భాగస్వాములు ముందుకు రావాలని కోరారు.
జీ-20 దేశాల సమావేశం..
కరోనా నేపథ్యంలో మార్చి 26న జీ-20 దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. పలు ఉద్దీపన చర్యలతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల సాయానికి అంగీకారం తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా భారీ ప్యాకేజీని ప్రకటించాలని జీ- 20 దేశాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 83వేలు దాటిన కరోనా మరణాలు