చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన శ్రమకు ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు లభిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇస్రో ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందామని ట్వీట్ చేసింది.
"అంతరిక్షం చాలా క్లిష్టమైన అంశం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2ను దించాలన్న ఇస్రో శాస్త్రవేత్తల శ్రమకు ప్రశంసలు. మీ ప్రయాణం మాకు స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం."
--- నాసా.
చంద్రయాన్-2పై పలు దేశాలు ఇప్పటికే భారత్కు తమ మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో యూఏఈ, ఆస్ట్రేలియా చేరాయి. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రశంసించాయి.
జాబిల్లిపై కాలుమోపే ప్రక్రియ చివరి నిమిషంలో ఇస్రో కేంద్రానికి ల్యాండర్ 'విక్రమ్'తో సంబంధాలు తెగిపోయాయి. ల్యాండర్ కోసం 14 రోజుల పాటు అన్వేషణ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అంతర్జాతీయ మీడియా కథనాలు..
న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ తదితర ప్రముఖ వార్తా పత్రికలు చంద్రయాన్-2పై విశేషంగా కథనాలు ప్రచురించాయి. అంతరిక్ష విభాగంలో భారత్ సాధించిన అభివృద్ధి.. శాస్త్రవేత్తల ప్రతిభను అంతర్జాతీయ మీడియా కీర్తించింది.
"ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు సామాజిక మాధ్యమాల్లో విశేష మద్దతు లభిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. భారత కీర్తి మరింత పెరిగేది. అతి తక్కువ ఖర్చుతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక విజయాలు అందుకుంది. చంద్రయాన్-2 వ్యయం 140 మిలియన్ డాలర్లు. అమెరికా చారిత్రక అపోలో మిషన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ."
--- వాషింగ్టన్ పోస్ట్.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: ఆఖరి క్షణంలో 'విక్రమ్'కు ఏమైంది?