ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. వ్యాక్సిన్ తయారీలో భాగం పంచుకున్న భారతీయ అమెరికన్లు గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు అని కొనియాడారు.
"నేను ఈ మధ్యనే భారత్‌కు వెళ్లాను. ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నాం. అంతేకాదు అమెరికాలో భారతీయుల జనాభా భారీగా ఉంది. వాళ్లు వ్యాక్సిన్ తయారీలోనూ భాగం పంచుకున్నారు. వాళ్లంతా గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు. భారత్ చాలా గొప్ప కృషి చేస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరించుకుంటున్నాం. భారత్‌తో కలిసి అదృశ్య శత్రువును చిత్తు చేస్తాం.
మీకు తెలుసు.. ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. భారత్‌లోని మన స్నేహితులకు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నామని ప్రకటించడం గర్వంగా ఉంది. మనం భారత్‌కు మద్దతుగా నిలవాలి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదే తొలిసారి..
అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థతో సహా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, జీవ వైద్య అంకుర సంస్థల్లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారతీయ అమెరికన్ల ప్రతిభకు సంబంధించి ఒక అమెరికా అధ్యక్షుడు ప్రశంసించటం ఇదే తొలిసారి.
మొదటి నుంచీ..
2016 అక్టోబర్‌లో న్యూజెర్సీలో భారతీయ అమెరికన్ల కోసం ప్రత్యేక ర్యాలీని నిర్వహించిన మొదటి వ్యక్తి ట్రంప్ కావటం విశేషం. అప్పటి నుంచి శ్వేతసౌధంలో భారత్‌తో పాటు భారతీయ అమెరికన్లకు తాను మంచి మిత్రుడని ట్రంప్ పలుమార్లు చెప్పారు.
అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు ఉండగా.. ఇందులో 25 లక్షల మంది కీలక ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వీరి ఓట్లు చాలా కీలకం కానున్నాయి.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాక్సిన్ డేటాను చైనా దొంగిలిస్తుంది'