వాతావరణ పరిశీలన వ్యవస్థపై కరోనా పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డబ్ల్యూఎమ్ఓ(ప్రపంచ వాతావరణ సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. అనేక ప్రాంతాల్లో వాతావరణ అంచనాలు, పర్యవేక్షణల్లో నాణ్యత పడిపోతోందని తెలిపింది.
కరోనా వైరస్ వల్ల డబ్ల్యూఎమ్ఓ ఆధారిత ప్రపంచ వాతావరణ అంచనా వ్యవస్థ పనితీరు నిత్యం ఒత్తిడికి గురవుతోంది.
వాతావరణ అంచనాల కొలతల కోసం సాధారణంగా విమానాలు వాడతారు. కానీ కరోనా వైరస్ వల్ల విమాన సేవలపై ఆంక్షలు విధించాయి ప్రపంచ దేశాలు. ఫలితంగా ఈ వ్యవస్థకు అందే ఇన్పుట్లు దాదాపు 80శాతం క్షీణించాయి.
ఉపరితలం ఆధారంగా చేసే పరిశీలనలపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఆఫ్రికా, మధ్య- దక్షిణ అమెరికాలోని అనేక కేంద్రాలు ఇంకా స్వయంచాలక వ్యవస్థకు మారకపోవడం ఇందుకు ప్రధాన కారణం.
"ప్రజల ఆరోగ్యాలను రక్షించడానికి ప్రపంచ దేశాలు చేపడుతున్న చర్యలకు అభినందనలు. కానీ వాతావరణ వ్యవస్థ సామర్థ్యం, వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుండటం ఆందోళనకర విషయం. వాతావరణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పసిఫిక్ ప్రాంతాల్లో తుపానులు, తూర్పు ఆఫ్రికాలో వరదలను మనం చూస్తూనే ఉన్నాం. కరోనా మహమ్మారి అదనపు సవాళ్లు విసురుతోంది. అందువల్ల తమ వద్ద ఉన్న వాతావరణ వ్యవస్థ సామర్థ్యంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి."
--- పెట్టెరి టాలస్, డబ్ల్యూఎమ్ఓ ప్రధాన కార్యదర్శి.
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఉపరితల పరిశీలనలు స్వయంచాలక వ్యవస్థకు మారిపోయాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉంది. పరిశీలకులపైనే అధికంగా ఆధారపడుతున్నాయి ఆయా దేశాలు.
సముద్రంలోని పరిస్థితుల్నీ నిత్యం పర్యవేక్షిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. ఈ వ్యవస్థ అధికంగా ఆటోమెషన్పైనే అధారపడుతుంది. అందువల్ల కొన్ని నెలల పాటు దీని పనితీరు మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తోంది.
ఇదీ చూడండి:- ఆ విటమిన్ లోపంతోనే కరోనా తీవ్ర ప్రభావం!