బ్రిటిష్ దిగ్గజ ట్రావెల్ సంస్థ థామస్ కుక్ ఆకస్మికంగా కుప్పకూలిన నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సంస్థ ద్వారా విహార యాత్రలకు వెళ్లిన వారంతా... ఒక్కసారిగా సేవల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
మెక్సికోలోని కాంకోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.
"రాత్రి టీవీల్లో చూసి, కొంతమంది చెబితే తెలుసుకున్నాం. ఇక తర్వాత ఈ రోజు ఉదయం విమానాశ్రయానికి వచ్చే వరకు ఎలాంటి విషయాలు తెలియవు."
-ఎలైన్ నీవొలిక్, ప్రయాణికులు
తాము ప్రయాణించాల్సిన విమాన సర్వీసుల సమాచారం కోసం మెక్సికన్ టెర్మినల్లో బారులు తీరారు ప్రయాణికులు. విమాన సర్వీసులకు సంబంధించి వినియోగదారులకు థామస్కుక్ ఎలాంటి ప్రకటన చేయలేదని వాపోయారు.
"నిజానికీ ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మాకెవరూ చెప్పలేదు. వార్తల్లో చూసి విషయాన్ని తెలుసుకున్నాం. సంస్థకు సంబంధించి ఎవరూ చెప్పలేదు. హోటల్లోనూ ఎలాంటి సమాచారం లేదు."
-కేటీ కౌడ్రీ, ప్రయాణికురాలు
దివాలా తీసిన 178 ఏళ్ల దిగ్గజం
ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్కుక్ సంస్థ దివాలా తీసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆ సంస్థ 2 బిలియన్ పౌండ్ల అప్పుల్లో కూరుకుపోయింది. నిధులకోసం ఇతర సంస్థలతో జరిపిన చర్చలు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయాయి.
ఇదీ చూడండి: ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!