కరోనా వైరస్‌పై పోరులో విశేష కృషిని కనబరుస్తున్న భారత్...వ్యాధి తీవ్రతను తెలియజేసే సమాచార నిర్వహణ, దాని నివేదనపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.
అధిక జనాభా, భౌగోళిక భిన్నత్వం, రాష్ట్రాల వారీగా వ్యాధుల తీవ్రతలో వ్యత్యాసాలు వంటి ప్రతికూలతలు సవాళ్లు విసురుతున్నప్పటికీ దృఢమైన రాజకీయ నాయకత్వం వల్ల లాక్‌డౌన్ విధింపు, సడలింపు వంటి నిర్ణయాలను సకాలంలో తీసుకోగలిగారని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల కారణంగానే రోజుకు 2లక్షలకు పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు. పరీక్ష కిట్ల తయారీలో స్వయంసమృద్ధిని సాధించారు. అయితే, కరోనాపై మలి విడత పోరుకు ఈ సన్నద్ధత సరిపోదని, దీర్ఘకాలిక వ్యూహం అవసరమని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. కరోనా కేసుల ద్వారా అందివస్తున్న సమాచార నిర్వహణలో, నివేదనలో జాతీయ స్థాయి మార్గదర్శకాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
త్వరితగతిన బాధితుల గుర్తింపు
'కేసు నమోదు ఒకటే సరిపోదు. టెస్టుల్లో పాజిటివ్ కేసుల శాతాన్ని తేల్చాలి. కేసుల సంఖ్య రెట్టింపు అవటానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతుందా, తగ్గుతుందా, సమాంతరంగా ఉందా అనేది ఎప్పటికప్పుడు గమనించాలి. అలాగే ప్రతి పాజిటివ్ కేసులో వైరస్ ఎవరెవరి నుంచి సోకుతుందో తెలుసుకొని సంబంధీకులందరినీ 48 గంటల నుంచి 72 గంటల్లోగా క్వారంటైన్‌కు తరలించాలి. అలా కాకుండా పది రోజుల తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్ చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సాధ్యమైనంత త్వరగా ఎంత ఎక్కువ మంది బాధితుల్ని గుర్తిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. కేసుల తీవ్రత స్థాయిని బట్టి వారికి అవసరమైన పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయన్నదీ కూడా ముఖ్యమే. ఐసీయూలో ఎంత మంది ఉంటున్నారు. మరణాల శాతం ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అంచనాకు రావాలి. అలాగే రాష్ట్రాల మధ్య సరైన సమాచార మార్పిడి జరగాలి' అని సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.
సుదీర్ఘ పోరు అవసరం..
పడకలు అందుబాటులో లేని ప్రాంతాల నుంచి అవి ఉన్న చోటుకు రోగుల తరలింపు జరగాలని ఆమె పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అక్కడి ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడిందని, అప్పుడు ప్రభుత్వం జర్మనీలో ఐసీయూ వసతులున్న ఆస్పత్రులకు రోగులను తరలించిందని తెలిపారు. కొవిడ్‌పై పోరు దీర్ఘకాలంపాటు సాగించాల్సి ఉంటుంది కనుక రాష్ట్రాల మధ్య ఈ తరహా యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: కొవిడ్ పరీక్షల కోసం చౌకైన విద్యుత్ రహిత సెంట్రిఫ్యూజ్