2021 సెప్టెంబర్ కల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు టీకా పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్. మహమ్మారిని అంతం చేసి.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి అదొక్కటే మార్గమని ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో స్పష్టం చేశారు.
వాక్సినేషన్ ప్రక్రియలో అసమానతలే మహమ్మారి వ్యాప్తికి కారణం. కొన్ని దేశాలు అధిక శాతం జనాభాకు టీకా అందించగలిగాయి. కానీ చాలా దేశాల్లో కనీసం అరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు కూడా టీకా పంపిణీ జరగలేదు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ అందించలేకపోతున్నాయంటే.. అది అన్ని దేశాలకు ప్రమాదకరమే.
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
అలా అయితే అంతం చేయనట్లే..
మహమ్మారిని అన్ని చోట్ల అంతం చేయకపోతే.. దానిని మనం ఎక్కడా అంతం చేయనట్లే లెక్క అని టెడ్రోస్ అథనోమ్ హెచ్చరించారు. సెప్టెంబర్ కల్లా ప్రతి దేశం కనీసం 10 శాతం మందికి, ఈ ఏడాది చివరినాటికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది సగానికి 70 శాతం జనాభాకు టీకా అందించాలని పిలుపునిచ్చారు. వాక్సిన్ సమానత్వంతోనే కరోనాను అంతం చేసి, ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించగలమని అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీలో అసమానతలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఒక శాతం కన్నా తక్కువ జనాభాకు వ్యాక్సిన్ అందించగా మరికొన్ని 60 శాతానికి పైగా పంపిణీ చేశాయి. ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకోగా.. ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ చేయడానికి ఉద్దేశించిన కొవాక్స్ కార్యక్రమం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దీని ద్వారా పేద దేశాలకు దాదాపు 8.1 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.
ఇవీ చదవండి:'సెప్టెంబర్ నుంచి బూస్టర్ డోసు పంపిణీ'