ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత రాజీనామా చేయాలని అమెరికాలో డిమాండ్ వినిపిస్తుంటే.. మరోవైపు నిధుల నిలిపివేతపై యూఎస్ పునఃసమీక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్. యూఎస్‌తో పాటు ఇతర దేశాలను రక్షించేందుకు డబ్ల్యూహెచ్ఓకు అందించే ప్రత్యేక నిధులుగా అమెరికా వీటిని గుర్తిస్తుందని ఆకాంక్షించారు.
టెడ్రోస్ రాజీనామా చేయాలి
కరోనా విపత్తుపై ప్రపంచదేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న ఆరోపణలతో ఆ సంస్థకు అందించే 700 మిలియన్ డాలర్లకు పైగా నిధులను తాత్కాలికంగా నిలిపివేసింది డొనాల్డ్ ట్రంప్ సర్కారు. 60 రోజులపాటు నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది. కొవిడ్-19 సంక్షోభంలో చైనా ప్రసార సాధనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోందని, మార్చి 11 వరకు కరోనాను మహమ్మారిగా పరిగణించలేదన్న వాదనలు వినిపిస్తోంది అగ్రరాజ్యం. ఈ కారణాలతోనే టెడ్రోస్ రాజీనామా చేయాలని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ముందుగానే హెచ్చరించాం
అయితే ఈ ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన మాత్రం వేరేలా ఉంది. కరోనా మహమ్మారి గురించి ప్రపంప దేశాలను ముందుగానే హెచ్చరించామని సమర్థించుకుంది. చైనా వెలుపల మొట్టమొదటగా 100 కేసులు నమోదైన సమయంలోనే కొవిడ్-19 గురించి అప్రమత్తం చేశామని ఉద్ఘాటించింది.
ఇదీ చూడండి : భారత్‌లో 21వేలు దాటిన కరోనా కేసులు