Biden Poland Visit: అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం కీలక ఐరోపా పర్యటన చేపట్టనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు నెల కావస్తున్న తరుణంలో బైడెన్ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Biden poland news
పర్యటనలో భాగంగా బైడెన్ మొదట బ్రస్సెల్స్ చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుబాతో భేటీ కానున్నారు. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్‌కు సందర్శించే ఆలోచన బైడెన్‌కు లేదని శ్వేతసౌధం వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
Joe Biden News
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా, నాటో, ఐరోపా దేశాలు ఐక్యంగా ముందుకుసాగుతున్నాయి. రష్యా సైనిక చర్యను తమకు భద్రతా పరంగా, వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా ముప్పుగా భావిస్తున్నాయి. అయితే నాటో సభ్యదేశాలు కానప్పటికీ ఉక్రెయిన్ వంటి దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి.
యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు మిగ్ ఫైటర్ జెట్లు నాటో ఎయిర్‌బేస్ ద్వారా సరఫరా చేయాలని పోలాండ్ మార్చి 9న చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. అలా చేస్తే యుద్ధానికి ఇంకా ఆజ్యం పోసినట్లు అవుతుందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్‌కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'పుతిన్‌తో చర్చలకు సిద్ధం.. విఫలమైతే మూడో ప్రపంచయుద్ధమే'