అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన పుస్తకాన్ని ప్రచురించరాదని శ్వేతసౌధం ఆదేశించింది. (సీక్రసీ లాస్) రహస్య చట్టాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
బోల్టన్ పుస్తకాన్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాథమికంగా సమీక్షించింది. ఇందులో రాసిన పలు అంశాల్లో... అధ్యక్షునికి సంబంధించి అత్యంత రహస్య సమాచారం ఉందని పేర్కొంది. వీటిని తొలగించకుండా.. ఈ పుస్తకాన్ని ప్రచురించడం గానీ, బహిర్గతం చేయడంగానీ చేయకూడదని బోల్టన్ న్యాయవాది చార్లెస్ కూపర్‌కు స్పష్టం చేసింది.
అధికార దుర్వినియోగం!
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రత్యర్థులను (డెమొక్రటిక్ నేత, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన కుమారుడు, ఇతరుల) ఇరుకున పెట్టేందుకు ఉక్రెయిన్ సహకరించే వరకు... ఆ దేశానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని ట్రంప్.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న నాతో (బోల్టన్) అన్నారు."- జాన్ బోల్టన్, పుస్తక రచయిత
బోల్టన్ స్వయంగా రాసిన ఓ పుస్తకంలో ఈ విషయం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.
రాజకీయ దుమారం
అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన ఈ పుస్తకం అగ్రరాజ్య రాజకీయాల్లో దుమారం రేపింది. ఇప్పటికే అభిశంసన తీర్మానంతో ట్రంప్‌పై గురిపెట్టిన ప్రత్యర్థులకు ఇది సరికొత్త అస్త్రమైంది. బోల్టన్‌ను సాక్షిగా సభకు పిలిచి, సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. చుట్టుముట్టిన సవాళ్ల నుంచి బయటపడేందుకు ట్రంప్ వర్గం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: బ్రెగ్జిట్‌కు తొలగిన అడ్డంకి.. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం