పొరుగున ఉన్న చైనాతో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హెచ్చరించారు. అమెరికా-రష్యాల మధ్య సంబంధాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి స్ధాయికి క్షీణించాయని అంతా భావిస్తున్న వేళ ఇరు దేశాధినేతలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా విషయంలో పుతిన్‌కు జాగ్రత్తలు సూచించిన బైడెన్.. సరిహద్దుల్లోని ఆ దేశం దూకుడును గమనించాలని అప్రమత్తం చేశారు.
రష్యాతో సన్నిహిత సంబంధాలకు అమెరికా సిద్ధంగా ఉందని, ఈ చర్చలను ఇక ముందు కూడా కొనసాగిస్తామని బైడెన్ తెలిపారు. పుతిన్ కూడా చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, బైడెన్ అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ భిన్నమైన వ్యక్తి అని పేర్కొన్నారు. తామిద్దరం పరస్పరం అర్ధం చేసుకున్నామని పుతిన్ తెలిపారు.
సైబర్ దాడి మీ పనే..
రాయబారుల అంశంపై రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు పుతిన్ తెలిపారు. రష్యా హ్యాకర్లు తమ సంస్థలపై దాడి చేశారని పేర్కొంటూ.. ఆ దేశ రాయబారులను బైడెన్ ప్రభుత్వం వెనక్కి పంపింది. అంతకుముందు రష్యా అదే పని చేసింది. ఈ చర్చల్లో ఆ సమస్య పరిష్కారమైనట్లు పుతిన్ పేర్కొన్నారు. సైబర్ దాడులపై అడిగిన ప్రశ్నకు పుతిన్ ఎదురుదాడి చేశారు. అమెరికాయే సైబర్ దాడులు చేసిందన్నారు.
ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ నిర్బంధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. నావల్నీ రష్యా చట్టాల్ని ఉల్లంఘించారని తెలిపారు. తనపై కేసులు ఉన్నాయని తెలిసి కూడా దేశం విడిచి పారిపోయారని చెప్పారు.
'అలెక్సీ నావల్నీ విషయం ప్రస్తావించా'
రష్యాలో మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని నిర్బంధించిన విషయాన్ని పుతిన్‌తో సమావేశంలో తాను ప్రస్తావించానని బైడెన్ తెలిపారు. "అమెరికా అధ్యక్షుడిగా మానవ హక్కుల గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాను. అలెక్సీ నావల్నీ లాంటి అంశాలు అమెరికా ఎప్పటికీ లేవనెత్తుతూనే ఉంటుంది" అని బైడెన్ చెప్పారు.
ఇదీ చూడండి: జెనీవాలో ముగిసిన అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ