వరుసగా రెండోసారి అధ్యక్షుడు కావాలని కలలుగని విఫలమైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ 2024లో ఆ పదవి కోసం ప్రయత్నిస్తారా? అప్పుడే అమెరికా రాజకీయ వర్గాల్లో మొదలైన ప్రశ్న ఇది! పట్టువదలని విక్రమార్కుడైన ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు సాంకేతికంగానైతే అవకాశముంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం...రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావొచ్చు. 'ఈసారి ఓడినంత మాత్రాన ట్రంప్ రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్లు కాదు. మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు తగ్గ శక్తిసామర్థ్యాలు ఆయనకున్నాయి' అని ట్రంప్ మాజీ సలహాదారు బ్రయాన్ లాంజా తెలిపారు.
ఒకవేళ అందుకు సిద్ధమైతే మాత్రం మరో నాలుగేళ్ల తర్వాత వచ్చే పోరుకు ట్రంప్ ఇప్పటి నుంచే సిద్ధం కావల్సి ఉంటుంది. అయితే, రిపబ్లికన్ పార్టీలో తన అవకాశాలను కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పటిదాకా రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు తిరుగులేని పరిస్థితి. ఓడిపోయినా... ప్రజల్లోనూ ఆయనకు బలమైన మద్దతుందనే సంగతి ఈ ఎన్నికల్లో రుజువైంది. 2024లో ట్రంప్ 78 ఏళ్ల వయసుకొస్తారు. అదేమీ అనర్హత కాదు. ఎందుకంటే... ప్రస్తుతం ఎంపికైన బైడెన్‌కు ఇప్పుడు అదే వయసు.
ఇలా ఒక పర్యాయం అధ్యక్ష పదవిలో ఉండి... ఓడి... మళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర అమెరికాలో ఉంది.
1884లో అమెరికా 22వ అధ్యక్షుడిగా వ్యవహరించిన గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాతి ఎన్నికలో ఓడిపోయారు. మళ్ళీ ఆయన 1892లో పోటీ చేసి 24వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ కూడా అలాగే చేయొచ్చన్నది ఆయన అభిమానుల సూచన. కానీ, 2024లో తాను కాకుండా... తన కుమార్తె ఇవాంకాను ట్రంప్ బరిలో దించినా ఆశ్చర్య పోనవసరం లేదనే వారు కూడా లేకపోలేదు.
అగ్గిబరాటాగా పేరొందిన ట్రంప్...
నిమ్మళంగా ఉండే వ్యక్తి కాదని, సొంత టెలివిజన్ నెట్‌వర్క్, మీడియా సంస్థను నెలకొల్పే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవిలో ఇంకా మూడు నెలలు కొనసాగుతారు కాబట్టి ప్రత్యర్థిపై న్యాయస్థానాల్లో మరిన్ని కేసులు వేస్తూ... అధికార మార్పిడిని సాధ్యమైనంత సంక్లిష్టం చేసేందుకు యత్నించే అవకాశం ఉందని ట్రంప్ తరఫున చాలా కాలం న్యాయవాదిగా ఉన్న మైఖేల్ కొహెన్ తెలిపారు.
ఇదీ చూడండి: 'నిజాయతీగా ఓట్లను లెక్కపెట్టేవరకూ నిద్రపోను'