అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 'స్పేస్ ఎక్స్' ఆదివారానికి వాయిదా వేసింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రయోగం చేపడితే రాకెట్ బూస్టర్‌ను తిరిగి సంపాదించడం కష్టమవుతుందని 'స్పేస్ ఎక్స్' పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి ఈ ప్రయోగం జరగాల్సింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు (ముగ్గురు అమెరికన్, ఒక జపాన్) వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది స్పేస్ ఎక్స్.
మస్క్‌కు అనుమతి ఉంటుందా?
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో భిన్నమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఒకేరోజు నిర్వహించిన నాలుగు ర్యాపిడ్ పరీక్షల్లో రెండుసార్లు పాజిటివ్, రెండుసార్లు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు మస్క్ తెలిపారు. కచ్చితమైన పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ర్యాపిడ్ టెస్ట్‌లు అంతా బోగస్: టెస్లా సీఈఓ
ఈ నేపథ్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా చేపట్టే ఈ ప్రయోగానికి ఎలాన్ మస్క్‌ను అనుమతిస్తారా? అనే విషయంపై స్పష్టత కొరవడింది. నాసా నియమాల ప్రకారం కరోనా పాజిటివ్‌గా తేలినవారు క్వారంటైన్లో ఉండాలి. మస్క్‌కు నెగెటివ్ వచ్చినా ఆయన్ను అనుమతిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ సమాచారం ప్రకారం ప్రయోగంలో పాల్గొనే నలుగురు వ్యోమగాములతో పాటు వారిని కలిసినవారి దగ్గరకు ఎలాన్ మస్క్ వెళ్లలేదని తెలిసింది.
అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు నాలుగు వారాలుగా క్వారంటైన్‌లోనే ఉన్నారని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. బయటివ్యక్తులను వారు కలవలేదని చెప్పారు.
ఇదీ చదవండి: అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్ ఎక్స్'