అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020పై విదేశీ జోక్యానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై తమ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
ట్రంప్కు మద్దతుగా రష్యా ప్రచారం చేస్తున్నట్లు శుక్రవారం నిఘా అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈ విధంగా స్పందించారు ట్రంప్.
"నన్ను శ్వేతసౌధంలో చూడాలనుకునేవారిలో చివరి దేశంగా రష్యా ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంపై నా అంత కఠినంగా వ్యవహరించినవారు మరొకరు లేరు. జో బైడెన్ చేతిలో నా ఓటమిని చైనా ఆస్వాదిస్తుంది. ఎందుకంటే వాళ్లు మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
నిఘా సంస్థ చెప్పిందేంటి?
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ను వ్యతిరేకంగా రష్యా ప్రచారం చేస్తున్నట్లు విశ్వసిస్తున్నామని అమెరికా నిఘా అధికారులు శుక్రవారం వెల్లడించారు. రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులు ట్రంప్ ఎన్నికకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విలియం ఇవానియా. అమెరికాలో విదేశీ జోక్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరిక కావటం గమనార్హం.
అయితే ట్రంప్ రెండోసారి గెలవాలని చైనా, ఇరాన్ కోరుకోవడం లేదని నిఘా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంపై చైనా దూకుడుగా విమర్శలు చేస్తోందని, అమెరికాలో ప్రజా విధానాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజింగ్ ప్రయోజనాలకు విరుద్ధంగా కనిపించే రాజకీయ వ్యక్తులపై ఆ దేశం ఒత్తిడి తెస్తోందని అమెరికా అధికారులు కూడా నమ్ముతున్నారు.
రహస్య ప్రయత్నాలు అరుదు..
2016 లో రష్యా సాయం చేయడానికి ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేసిన ఆరోపణలను అప్పట్లో తిరస్కరించారు ట్రంప్. అయితే తాజాగా ఇవానియా చేసిన ప్రకటన ట్రంప్ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. అయితే అమెరికా ఎన్నికల్లో పూర్తి స్థాయి జోక్యం ఉండే అవకాశం లేదని ఇవానియా పేర్కొన్నారు.
"ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై చాలా దేశాలు ప్రధానంగా గమనిస్తుంటాయి. వారు బహిరంగ, ప్రైవేట్ ప్రకటనల ద్వారా వ్యక్తీకరిస్తారు. అంతేకానీ రహస్య ప్రభావ ప్రయత్నాలు చాలా అరుదు. కానీ, చైనా, రష్యా, ఇరాన్ కార్యకలాపాల గురించి ప్రధానంగా ఆందోళన చెందుతున్నాం."
- విలియం ఇవానియా
ఇదీ చూడండి: అమెరికాలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు